హిందూపురం : ప్రజా గొంతు నొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిఓను రద్దు చేయాలని కోరుతూ గురువారం స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించి, ప్లకార్డులు ప్రదర్శించి జిఓ ప్రతులను చింపి కాల్చారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు నాగరాజు, నెట్టప్ప, రాష్ట్ర నాయకులు అంజినప్ప, పట్టణ అధ్యక్షులు రమేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోను, 1861 పోలీస్ యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాము, రామాంజినమ్మ, పరిమళ, వెంకటేష్, ఆర్‌ఎంఎస్ షఫీవుల్లా, అజ్మతుల్లా, అమర్నాథ్, జయప్ప, కౌన్సిలర్ సతీష్‌కుమార్, రాఘవేంద్ర, మాజీ జెడ్పిటిసి ఆదినారాయణ, శివశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మడకశిర :సభలు సమావేశాలను నిషేధిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కార్ జీవో నెంబర్.1 విడుదల చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 1 ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, పుల్లయ్య చౌదరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










