మైలాపురంలో ఆనందయ్య, లక్ష్మీదేవి అనే దంపతులు ఉండేవారు. వారికి సౌజన్య, రవి అనే ఇద్దరు పిల్లలున్నారు. సౌజన్యకు చెట్లు పెంచడమంటే ఇష్టం. రవికి మాత్రం ఆటలంటే మక్కువ. ఇంటిముందు ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలనే ఆలోచన చేసింది సౌజన్య. ఈ విషయాన్ని తండ్రితో చెప్పి, రెండు జామ మొక్కలు తెప్పించుకుని నాటింది.
ఒకరోజు రవి తన స్నేహితులతో కలిసి ఇంటిముందు ఖాళీ స్థలంలో బంతాట ఆడుతున్నాడు. అక్క నాటిన మొక్కలు అడ్డుగా ఉన్నాయని వాటిని పీకేశాడు. దాంతో సౌజన్య, తమ్ముడితో గొడవకు దిగింది. 'నా ఆటకు అడ్డుగా ఉన్నాయి. అందుకే పీకేశాను' అంటూ అక్కతో వాదనకు దిగాడు రవి. ఇదంతా గమనిస్తున్న లక్ష్మీదేవి కొడుకును మందలించింది. అయినా వాడిలో ఎలాంటి మార్పూ రాలేదు.
ఇంటి ముందు ఖాళీ స్థలం అలా బోసిపోయి ఉండడం సౌజన్యకి నచ్చలేదు. మరలా వాళ్ల నాన్నతో దానిమ్మ మొక్కలు తెప్పించి, నాటింది. రోజూ నీళ్లు పోస్తూ శ్రద్ధగా పెంచుకుంది. అవి పెరిగి చిగురాకు వేయగానే చాలా సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. తన ఆటలకు దానిమ్మ చెట్లు అడ్డు వస్తున్నాయని మళ్లీ పీకేశాడు రవి. సౌజన్య చాలా బాధపడింది.
అదే రోజు రాత్రి రవికి కలలో జామచెట్టు, దానిమ్మచెట్టు కనిపించాయి. అవి రెండూ ఏడుస్తూ నిలబడ్డాయి. 'ఎందుకు ఏడుస్తున్నారు?' అని అడిగాడు రవి. అవి సమాధానం చెప్పలేదు, ఏడుస్తూనే ఉన్నాయి. 'మిమ్మల్ని ఎవరైనా కొట్టారా?' అని అడిగాడు. 'మమ్మల్ని చూస్తే కొంతమందికి అసూయ.. మేము అడ్డుగా ఉన్నామని మమ్మల్ని నరికేస్తున్నారు.. చంపేస్తున్నారు.. పసి మొక్కలని కూడా చూడకుండా పీకేస్తున్నారు' అంటూ ఆ చెట్లు గట్టిగా ఏడ్చాయి. 'మిమ్మల్ని అడ్డంగా ఎవరు నిలుచోమన్నారు? అలా ఉంటే పీకేయరా? మరి' అన్నాడు రవి. 'చెట్టు విలువ తెలియని నీతో చెప్పుకోవడం మా బుద్ధి తక్కువ' అంటూ ఆ చెట్లు మాయమయ్యాయి.
దాంతో చెట్లపై కోపం పెంచుకున్నాడు రవి. ఒకరోజు బడికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు ఖాళీ స్థలంలో సుమారు ఐదారు చెట్లు నాటి ఉన్నాయి. 'నాన్న.. నేను ఆడుకోవడానికి కొంచెం కూడా స్థలం లేదు. అంతా చెట్లకే సరిపోయింది. వాటిని తీసేరు.. ఆటలో గెలిస్తే కప్పు కొట్టవచ్చు. వీటి వలన ఉపయోగం ఏంటి?' అంటూ నాన్నతోనూ గొడవకు దిగాడు. 'ఆటలూ మంచివే కాదనను.. కానీ పాఠాలు వింటే నీకు చెట్ల విలువ తెలుస్తుంది' అన్నాడు తండ్రి.
ఒకరోజు రవి వాళ్ల బడిలో మాష్టారు పిల్లలందరినీ తోటకు తీసుకెళ్లాడు. అక్కడ చెట్లను చూపుతూ చెట్ల విలువ చెప్పసాగారు. 'చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలున్నాయి. అవి ప్రాణవాయువు, నీడను ఇస్తాయి. కలపను ఇస్తాయి. ఇంకా చెట్ల వలన మనిషికి ఎన్నో లాభాలు ఉన్నాయి. చెట్లు లేకపోతే వర్షం పడదు.. వర్షం రాకపోతే పంట పండదు.. దాని వలన కరువు ఏర్పడి, తిండి దొరకదు. చెట్లు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. మంచి పండ్లను ఇస్తాయి. కాబట్టి ప్రతి ఇంటి ముందు చెట్లు నాటి, వాటిని సంరక్షించడం మన కర్తవ్యం' అని చెప్పారు. ఆ మాటలు విన్నాక రవిలో కొత్త ఆలోచన వచ్చింది. తను ఇన్నాళ్లు అనుకున్నది ఎంత తప్పో అర్థమయ్యింది. పిల్లలందరికీ మాష్టారు ఒక్కొక్క మొక్కను కానుకగా ఇచ్చారు. రవి మరోమొక్కను అదనంగా అడిగి తీసుకున్నాడు.
ఇంటి ముందు ఖాళీ స్థలంలో రవి స్వయంగా మొక్కలను నాటుతుంటే చూసిన సౌజన్య నమ్మలేకపోయింది. 'అక్కా.. నన్ను క్షమించు.. చెట్టు విలువ తెలుసుకోలేక ఇన్నాళ్లూ మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను. ఈరోజు మాష్టారు వల్ల చెట్టు గురించి చాలా చక్కగా తెలుసుకున్నా.. నాకు జ్ఞానోదయమైంది. చెట్టు విలువ తెలిసొచ్చింది' అని అన్నాడు రవి. తమ్ముడిలో వచ్చిన మార్పు చూసి, అక్క మొహంలో ఆనందం తొంగి చూసింది.
రజిత కొండసాని
99492 95459