జిల్లాలో చెత్తపన్ను వసూళ్లకు వేళైంది. ప్రభుత్వం ఏడాది కిందట చెత్త పన్ను వసూలు చేయసంకల్పించింది. చెత్త పన్ను వసూలు జిఒను సిపిఎం వెలుగులోకి తెచ్చి ఆందోళన చేపట్టింది. చెత్తపన్ను వసూలు అంశం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు పోరుబాట పట్టినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. చెత్త పన్ను వసూలును సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఇంటి పన్నుతో కలిపి చెత్తపన్ను వసూళ్లను అనుసంధానం చేయడానికి కసరత్తు చేస్తోంది. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలోని కడప కార్పొరేషన్ సహా మిగిలిన మున్సిపాలిటీల్లో చెత్త పన్ను వసూలుకు రంగం సిద్ధమైంది. ఏడాది కిందటి నుంచి కడప నగర పాలక సంస్థ, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో మాత్రమే వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. కడప, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అనుభవాల ఆధారంగా ఏప్రిల్ నుంచి కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలు సహా మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్ మున్సి పాలిటీల్లో వసూలు చేయనున్నారు. కడప కార్పొరే షన్ సహా జిల్లాలోని మున్సిపల్ యంత్రాంగాలు కార్యాచరణను వేగవంతం చేసింది. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) పేరుతో ఇంటి పన్నుతో కలిపి చెత్త పన్ను వసూలు చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం (బడ్జెట్ ముందటి) సందర్భంగా వామపక్షాలు చెత్తపన్ను మినహాయించాలని ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే, మేయర్, సహా పలువురు కార్పొరేటర్లు ఎన్నికల ముంగిట చెత్తపన్ను వసూలును వాయిదా వేయాలనే డిమాండ్ మేరకు తీర్మానం చేసి పంపించినప్పటికీ ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. స్లమ్ ఏరియాలో రూ.40, మిగిలిన ఏరియాలో రూ.90 చొప్పున వసూలు చేస్తున్నారు. పన్ను వసూలు నిమిత్తం సచివాలయ సిబ్బంది గుంపులుగా ఇళ్ల దగ్గరకు వెళ్లి వసూలు చేస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తినప్పటికీ తగ్గలేదు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ప్రోగ్రామ్‌లో భాగంగా చెత్తసేకరణ వేగవంతమైంది. ప్రతి ఇంటి దగ్గర నుంచి తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించాల్సి ఉంది. ఇటువంటి చెత్త సేకరణ కాంట్రాక్టును ఓ ప్రయివేటు సంస్థకు కట్టబెట్టింది. ఆ సంస్థ కడప కార్పొరేషన్‌లో 100 ఆటోలను ఏర్పాటు చేసింది. 90 ఆటోలు మాత్రమే పన్ను వసూలు ప్రక్రియలో పాలు పంచుకుంటున్నాయి. ఒక్కో ఆటో నెలకు రూ.63 వేలు చొప్పున రూ.61 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతుండడం గమనార్హం.
రోజూ ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించడం అంతంత మాత్రంగా సాగుతోంది. చెత్త సేకరణ కార్మికులకు సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం, వాహనాలు మొరాయించడం వంటి కారణాలతో చెత్త సేకరణ ప్రక్రియ సజావుగా సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల శివారు ప్రాంతాల్లో రెండు, మూడురోజులకు ఒకసారి చెత్తను సేకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వేళాపాళా లేకుండా చెత్త సేకరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. నెలకు చెత్త పన్ను ద్వారా కార్పొరేషన్‌లో రూ.41 లక్షలు వసూలు అవుతోంది. పన్ను వసూలు చేసినా చేయకున్నా ప్రయివేటు సంస్థ మాత్రం కార్పొరేషన్, మున్సి పాలిటీలకు పన్ను చెల్లించాల్సి ఉంది. ప్రజల నుంచి పన్ను వసూలు సజావుగా సాగని నేపథ్యంలో సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటి పన్నుతో కలిపి చెత్తపన్ను వసూలు చేయడానికి రంగం సిద్ధమైంది. సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఇంటి పన్ను వసూలు కోసం ఒత్తిడి పెంచడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చెత్త పన్ను వసూలు చేయడానికి సులభతర మార్గాన్ని అన్వేషించారు. చెత్త పన్ను కూడా ఇంటి పన్నుతో కలిపి వసూలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. ఇంటి పన్నుతో కలిపి చెత్త పన్ను వసూలు చేయడానికి ఉద్దేశించి ఇళ్ల మ్యాపింగ్ చేసే ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే చకచకా మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.










