Aug 06,2022 22:45

ప్రజాశక్తి-విజయవాడ
ఉద్యోగ, కార్మికుల పొట్టగొట్టే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెత్త పన్నుకు, కార్మికుల జీతాలకు లింక్‌ పెట్టే ఆదేశాలను నగరపాలక సంస్థ రద్దు చేసుకోకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని సిఐటియు రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబూరావు హెచ్చరిం చారు. నగరపాలక సంస్థలో చెత్త పన్నుకు కార్మికుల వేతనాలకు లింక్‌ పెట్టే ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరుతూ 23వ డివిజన్‌లోని రెహమాన్‌ పార్కు వద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. చెత్త పన్నుకు, కార్మికుల వేతనాలకు లింక్‌ పెట్టే విధానాన్ని అధికారులు ఉపసంహరించుకోవాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, పని భారం తగ్గించాలని కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమానుద్దేశించి బాబూరావు మాట్లాడుతూ చెత్త పన్ను చెల్లించినట్లు రసీదు చూపిస్తేనే వేతనాలు చెల్లించడం జరుగుతుందని, లేనట్లయితే వేతనాలు చెల్లించరని విజయవాడ నగరపాలక సంస్థలో అధికారులు తాకీదులు జారీ చేయడం విచిత్రకరమైన పరిస్థితి అని దుయ్యబట్టారు. ఒక వైపున ధరలు ఆకాశాన్నంటుతూ, చార్జీలు పెరిగి వచ్చే అరకొర వేతనాలు కూడా వాటికే సరిపోతుండగా, కార్మికుల కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి ఎం డేవిడ్‌, సిఐటియు జిల్లా నాయకులు టి ప్రవీణ్‌, యూనియన్‌ కోశాధికారి డి స్టీఫెన్‌బాబు, సేలం దాసు, తిరుపతమ్మ, సింగంపల్లి శ్రీను, సుబ్బారావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.