Feb 17,2022 07:28

మత్స్యకారుల ఆందోళనలను పట్టించుకోని సర్కారు
- ఇాటెండర్ల ద్వారా ఏజెన్సీల ఎంపిక

ప్రజాశక్తి -ప్రత్యేక ప్రతినిధిా అమరావతి :ప్రభుత్వ స్థలాల్లో గల చేపల చెరువుల బహిరంగ వేలానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాల జీవనోపాధికి గండికొట్టే చెరువుల వేలం ఆలోచనను విరమించుకోవాలని, గతేడాది ఆగస్టు 18న వెలువరించిన జిఒఆర్‌టి నెం.217ను రద్దు చేయాలని మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నా సర్కారు పట్టించుకోలేదు. జిఒ వచ్చినప్పుడే రూపొందించిన గైడ్‌లైన్స్‌ను గోప్యంగా ఉంచిన ప్రభుత్వం బుధవారం అధికారిక గెజిట్‌లో నోటిఫై చేసింది. చెరువుల వేలం పైలెట్‌ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో అమలు చేస్తామని, విజయవంతమైతే రాష్ట్రం మొత్తానికీ విస్తరిస్తామని పేర్కొంది. వంద హెక్టార్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో గల చెరువుల్లో చేపల పెంపకం, పట్టుకొని అమ్మడానికి ఇాటెండర్లు పిలుస్తారు. చేపల ఉత్పత్తి, ఆదాయం ఆధారంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ బేసిక్‌ ధరను నిర్ణయిస్తుంది. దానికి తక్కువకు టెండర్‌ ఖరారు చేయరు. కనీసం ఏడాదికి అప్‌సెట్‌ ప్రైస్‌ రూ.25 వేలు ఉండాలి. పరిస్థితులను అంచనా వేసి ధరలో మార్పులు చేసే అధికారం జిల్లా కమిటీకి ఉంది. తుది ఆమోదం రాష్ట్ర కమిటీది.
మూడేళ్ల లీజు
మూడేళ్లపాటు లీజు సమయం. లీజు అమౌంట్‌లో 25 శాతం టెండర్‌ అగ్రిమెంట్‌ రోజున చెల్లించాలి. పది శాతం సెక్యూర్టీ అమౌంట్‌ కూడా చెల్లించాలి. తతిమ్మా 75 శాతం లీజు అమౌంట్‌ 90 రోజుల్లో చెల్లించాలి. గడువులోపు చెల్లించకపోతే టెండరు రద్దు చేస్తారు. వచ్చే రెండేళ్లపాటు వేలంలో పాల్గనకుండా డిబార్‌ చేస్తారు. జులై నుండి జూన్‌ వరకు లీజు సంవత్సరం. ప్రతి ఏడాదీ 10 శాతం లీజు అమౌంట్‌ పెరుగుతుంది. సెక్యూర్టీ అమౌంట్‌ మూడేళ్లకు తిరిగి ఇచ్చేస్తారు. ఆదాయం పంపిణీని నిర్ణయించారు.
కార్మికులకు డివిడెండ్లు
వేలం ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతం లేక కో-ఆపరేటివ్‌ సొసైటీలోని ప్రతి సభ్యునికి రూ.15 వేలు.. ఈ రెంటిలో ఏది తక్కువైతే దాన్ని డివిడెండ్‌ రూపంలో ప్రతి సంవత్సరం చెల్లిస్తారు. గ్రామ పంచాయతీకి 10 శాతం, ఫిషరీస్‌ డిపార్టుమెంట్‌కు 20 శాతం, నీటి వనరుల శాఖకు 40 శాతం పంచుతారు. నీటి వనరులను టెండర్‌ ఏజెన్సీ ఏ విధంగానూ నష్టపర్చరాదు. అనుమతించిన రకాలనే పెంచాలి. ప్రకృతి విపత్తుల నష్టం ఏజెన్సీయే భరించాలి. నీటి వనరుల శాఖ చెరువుల్లో నీటి వనరులను నిర్వహించాలి. గ్రామ పంచాయతీలు చెరువులకు అవసరమైన చిన్న రిపేర్లు చేయాలి. ఫిషరీస్‌ డిపార్టుమెంట్‌ మత్స్యకారుల సంక్షేమం చూడాలి. చెరువులపై పని చేసే కూలీల విషయంలో మత్స్యకార సొసైటీలకు టెండర్‌ ఏజెన్సీలు ప్రాధాన్యత ఇవ్వాలి.