చెకుముఖి పత్రికను ప్రోత్సహించాలి : జెవివి
ప్రజాశక్తి-కావలి : సైన్స్ పరంగా ప్రజలను అభివృద్ధి పరచుకునేందుకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు జె.వి.వి. ఆధ్వర్యంలో వెలువడుతున్న ''చెకుముఖి'' సైన్స్ మాసపత్రికలను ప్రతిఒక్కరితో చదివించి ప్రోత్సహించాలని జె.వి.వి. కార్యవర్గ సభ్యులు కృషి చేయాలని జె.వి.వి.బాధ్యులు పిలుపు నిచ్చారు. పట్టణంలోని రవి నర్సింగ్ హోమ్‌లో కావలి పట్టణ జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గౌరవాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్, అధ్యక్షులు తోట.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల ఫిబ్రవరిలో కావలి పట్టణంలోని రెడ్‌క్రాస్‌లో కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని జరిగిన సైన్స్ వారోత్సవాలు కావలి పట్టణ, పరిసర ప్రాంతాల విద్యార్థులలో 'సైంటిఫిక్ టెంపర్'ను పెంపొందించినట్లు తెలియజేశారు. విద్యార్థుల్లో ఈ సైంటిఫిక్ టెంపర్‌ను నిరంతరం కొనసాగింపు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెకుముఖి మాస పత్రికలు అందించడానికి క్యాంపైన్ నిర్వహించి, ఆయా స్కూళ్లకు క్రమం తప్పకుండా ప్రతినెలా చెకుముఖి మాసపత్రిక వచ్చేటట్లు చూడాలని తెలిపారు. స్థానికంగా స్కూల్‌లో పనిచేస్తున్న సైన్సు ఉపాధ్యాయులతో జె.వి.వి. కార్యవర్గ సభ్యులు కలిసి విద్యార్థులను చెకుముకి పత్రికలు చదివేటట్లు ప్రోత్సహించాలన్నారు. తద్వారా విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్‌ను పెంపొందించి కొనసాగించాలని తెలియజేశారు. 'నేటి విద్యార్థులే రేపటి పౌరులు' కనుక వీరి ద్వారానే సమాజంలోని మూఢనమ్మకాలకు చెక్ పెట్టాలని తెలియజేశారు. కార్యక్రమంలో కావలి పట్టణ జనవిజ్ఞాన వేదిక కోశాధికారి టి.సుబ్బరామశర్మ, ఉపాధ్యక్షులు పాపిశెట్టి.జానకిరామ్, కందికట్టు.నారాయణ, సంయుక్త కార్యదర్శి షేక్.ఖాదర్ భాషా, ఇ.సి. సభ్యులు జి.కళ్యాణి, వి.మల్లికార్జునరావు, ఆళ్ల.కోటేశ్వరరావు, సభ్యులు గాదిరెడ్డి. మురళీకృష్ణ, సి.హెచ్.హెచ్.వి. రాజశేఖర్, జాన్, తదితరులు పాల్గొన్నారు.










