Jan 17,2023 18:19

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న చంద్ర ఓబుల్‌రెడ్డి, జెవివి నాయకులు

ప్రజాశక్తి-కడప అర్బన్‌: ఈ నెల 21, 22వ తేదీలలో కడపలో నిర్వహించనున్న చెకుముకి రాష్ట్ర స్థాయి సైన్స్‌ సంబరాల పోస్టర్‌ను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్‌ రాహుల్‌, ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, కందుల రాజేశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రతినిధులు సరస్వతి, సునీత, కామేశ్వరమ్మ, ప్రేమ్‌, కెఎస్‌ఆర్‌ఎం కళాశాల ఎమ్‌డి డాక్టర్‌ చంద్ర ఓబుల్‌రెడ్డి మంగళవారం పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్ర ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచే క్రమంలో జెవివి కృషి ప్రశంసనీయమన్నారు. జెవివి రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌ రాహుల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలకు అవగాహన కల్పించడానికి, విద్యార్థులలో శాస్త్రీయ దృక్ఫథాన్ని ప్రోత్సహించడానికి జెవివి ఈ సంబరాలు నిర్వహిస్తోందన్నారు. ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకొని వారిలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందింపచేస్తే సమాజంలో ఆలోచనపరులుగా సరైన జ్ఞానంతో పెరుగుతారన్నారు. పాఠశాల విద్యార్థులలో సైన్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడం, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో చురుకుగా పాల్గొంటుందని తెలిపారు. మా సంస్థ ప్రతి సంవత్సరం చెకుముకి సైన్స్‌ ఫెస్టివల్‌ అని పిలవబడే ఒక మెగా సైన్స్‌ ఈవెంట్‌ను పాఠశాల, మండలం, జిల్లా చివరకు రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తోందన్నారు. ఇందులో సైన్స్‌ జ్ఞానాన్ని పెంపొందించడానికి క్విజ్‌లు, పరీక్ష, ప్రయోగాలతో సహా అనేక వినోదాత్మక సైన్స్‌ కార్యకలాపాలు ఉంటాయన్నారు.