Aug 06,2021 06:09

వై.ఎస్‌. జగన్‌ 2019లో అధికారం లోకి వచ్చినప్పుడు చేనేతకు అండగా ఉంటానని ప్రకటించారు. రాష్ట్రంలో 2 లక్షల మగ్గాలపై చేనేత కార్మికులు పని చేస్తుంటే ప్రతి మగ్గానికి రూ.24 వేలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 81 వేల మందికి మాత్రమే రూ.24 వేలు బ్యాంకులో వేసి మిగతా వారికి అన్యాయం చేశారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ మగ్గం కూడా అద్దెకు తీసుకొని మగ్గం షెడ్లలో నేస్తున్న వారికి ఈ పథకం వర్తించదని చెప్పి అన్యాయం చేశారు.
     రాష్ట్రంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్నదనేది జగమెరిగిన సత్యం. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మగ్గాలపై పని జరుగుతున్నది. ఉప వృత్తుల వారు మరో 3 లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా సహకార రంగంలో నూటికి 5 శాతం మించి పని దొరకడంలేదు. మిగతా వారంతా ప్రైవేటు సెక్టారు లోని మాస్టరు వీవర్ల వద్ద చేనేత పని చేస్తున్నారు. వీరికి కనీస వేతనం (మజూరి) లభించదు. వస్తున్న ఆదాయంతో కుటుంబాలు గడవక అప్పులు చేస్తూ ఆకలి చావులు, ఆత్మహత్యలకు బలవుతున్నారు. వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు జరిగాయి.
     వ్యవసాయం తర్వాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం. అటువంటి రంగాన్ని అభివృద్ధి చేసి చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచవలసిన పాలక వర్గాలు, ఎన్నికలలో ఓట్లు సంపాదించడానికి చేనేతను రక్షిస్తామని, చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పి అధికారానికి వచ్చిన తరువాత చేనేత గురించి పట్టించుకునే పరిస్థితి లేదు.
 

                                                       హ్యాండ్లూమ్‌ బోర్డు రద్దు తీరని అన్యాయం

   చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకొనేందుకు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే సమస్యలను చర్చించి ప్రభుత్వం దృష్టికి తేవడానికి 1992లో ఏర్పాటు చేసిన ఆలిండియా హ్యాండ్లూమ్‌ బోర్డును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత సంవత్సరం సరిగ్గా జాతీయ చేనేత దినోత్సవం రోజున రద్దు చేసింది. మరోపక్క చేనేతకు గతంలో ఎన్నడూ లేనటువంటి జిఎస్‌టి పన్ను వేసింది. ఈ పన్ను కారణంగా చేనేత బట్ట ధరలు పెరిగాయి. మార్కెట్‌లో పెరిగిన ధరలకు వస్త్రాలు అమ్ముడు పోక చేనేత పరిశ్రమ మరింత సంక్షోభం లోకి నెట్టబడింది. మార్కెట్‌లో వస్త్రాలు అమ్ముడు పోకపోవడంతో కొంతమంది మాస్టర్‌ వీవర్లు ఈ రంగం నుండి వైదొలగుతున్నారు. పవర్‌లూమ్‌ యజమానులు రిజర్వేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించి చేనేతకు కేటాయించిన వస్త్రాలను పవర్‌లూమ్‌లపై తయారుచేస్తున్నా బిజెపి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోగా వారికి అనేక రకాల రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. దీనితో మార్కెట్‌లో పవర్‌లూమ్‌ బట్టలు కారుచౌకగా లభించడంతో చేనేత సంక్షోభం లోకి నెట్టబడింది. ఇది చాలదన్నట్లు మరొక పక్క కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు వందల ఎకరాలు భూమి కారుచౌకగా బడా కంపెనీలకు కేటాయిస్తున్నది. కోట్ల రూపాయల రాయితీలు ఇస్తోంది.
 

                                                            రాష్ట్రంలో అండగా వుంటానన్నావే...

    సహకార రంగంలో చేనేత కార్మికులకు నూటికి 5 శాతం మించి పని దొరకడంలేదు. మిగతా వారంతా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నారు. వీరికి 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయించాల్సి ఉండగా 2014 నుండి ఇప్పటివరకు ప్రభుత్వం చట్టం చేయకపోవడంతో కనీస వేతనం పెరగలేదు. మరోపక్క నిత్సవసరాల ధరలు విపరీతంగా పెరగడంతో వస్తున్న ఆదాయం చాలక అర్థాకలితో కాలం గడుపుతూ అనారోగ్యం పాలై ఆకలిచావులకు గురవుతున్నారు. కొంతమంది అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 'రాజీవ్‌ విద్యా మిషన్‌' ద్వారా రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న బాలబాలికలకు చేనేత వస్త్రాలు ఉచితంగా ఇవ్వాలి. ఆప్కో వీటిని సహకార సంఘాల్లో చేనేత కార్మికుల ద్వారా తయారు చేయించి ఇవ్వాలి. ఆప్కో పాలకవర్గం పవర్‌లూమ్‌ యజమానుల దగ్గర వస్త్రాలు కొని తామే తయారు చేయించినట్లు స్కూలు పిల్లలకు ఇస్తున్నది. రికార్డులలో చేనేత వస్త్రం పథకం కిందనే చూపి ఆప్కో పాలకవర్గం, అధికారులు కోట్లకు పడగలెత్తుతున్నా పాలక పార్టీలు పట్టించుకోవడం లేదు.
     వై.ఎస్‌.జగన్‌ 2019లో అధికారం లోకి వచ్చినప్పుడు చేనేతకు అండగా ఉంటానని ప్రకటించారు. రాష్ట్రంలో 2 లక్షల మగ్గాలపై చేనేత కార్మికులు పని చేస్తుంటే ప్రతి మగ్గానికి రూ.24 వేలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 81 వేల మందికి మాత్రమే రూ.24 వేలు బ్యాంకులో వేసి మిగతా వారికి అన్యాయం చేశారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ మగ్గం కూడా అద్దెకు తీసుకొని మగ్గం షెడ్లలో నేస్తున్న వారికి ఈ పథకం వర్తించదని చెప్పి అన్యాయం చేశారు. దీన్నిబట్టే ఈ ప్రభుత్వానికి చేనేత వర్గంపై ఏమాత్రం అవగాహన ఉందో అర్థమవుతోంది.
     కరోనా తరుణంలో సహకార సంఘాల దగ్గర పేరుకుపోయిన చేనేత వస్త్ర నిల్వలు కొనుగోలు చెయ్యాలని, అలాగే మాస్టర్‌ వీవర్ల వద్ద నిల్వలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా... రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో సంస్థ వద్ద డబ్బులు లేవని కొనుగోలు చెయ్యలేదు. కానీ చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో ఆప్కో రూ. కోటిన్నరతో పవర్‌లూమ్‌ వస్త్రాలను కొనుగోలు చేసింది. రూ.20 కోట్లతో 22 లక్షల మీటర్ల పవర్‌లూమ్‌ వస్త్రాలు కొనుగోలు చేయడానికి జీవో కూడా విడుదల చేసింది. ఈ ఏడాది గత సంవత్సరం కంటే ఎక్కువగా కరోనా వ్యాపిస్తున్నది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాస్టర్‌ వీవర్లు, సహకార సంఘాల దగ్గర ఉన్న నిల్వలను వెంటనే కొనుగోలు చేసి డబ్బు చెల్లించాలి. తద్వారా కార్మికులకు మరల పని కల్పించడానికి అవకాశం ఉంటుంది.
 

                                                                     తక్షణం తీసుకోవాల్సిన చర్యలు

  •     కరోనా విజృంభిóస్తున్న ఈ తరుణంలో ప్రతి చేనేత కార్మికునికి నెలకు రూ.7500 అందించి ఆదుకోవాలి. ్క కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన జిఎస్‌టి రద్దు చెయ్యాలి.్క ఎన్‌హెచ్‌డిసి ద్వారా నూలు సప్లయి చేయాలి. సహకార సంఘాలు మాస్టర్‌ వీవర్ల దగ్గర వద్ద ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వెంటనే డబ్బు చెల్లించాలి. ్క నూలు జరీ పట్టును ప్రభుత్వమే సప్లయి చేయాలి.
  • సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బును వెంటనే అందించాలి. ్క యారన్‌ సబ్సిడీ పావలా వడ్డీ త్రిఫ్టు ఫండు డబ్బు వెంటనే చెల్లించాలి. 
  • మగ్గం షెడ్లలో నేత నేస్తున్న చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్‌ నేతన్న హస్తం పథకం అమలు జరిపి ప్రతి చేనేత కార్మికునికి రూ. 24 వేలు ఇవ్వాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం పవర్‌లూమ్‌లను అరికట్టలేకపోవడంతో భవిష్యత్తులో చేనేత పరిశ్రమ కుదించుకుపోతుంది. కనుక చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్‌లు ఖచ్చితంగా అమలు జరపాలి. ఉల్లంఘించిన పవర్‌లూమ్‌ యజమానులపై చర్యలు తీసుకోవాలి. చేనేత రక్షణకు కేరళ అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి ఇక్కడ కూడా అమలు జరపాల్సిన అవసరం ఉంది.                                                                                                                                                         ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటువంటి ప్రత్యామ్నాయ విధానాలను అమలు జరపడానికి, చేనేత రక్షణకు, చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెరుగుదలకు కేరళ రాష్ట్రంలో మాదిరిగా వెల్ఫేర్‌ ఫండ్‌ బోర్డు ఏర్పాటు చేసి సహకార రంగాన్ని పటిష్టపరచాలి. చేనేత కార్మికులందరినీ సహకార రంగంలోకి తీసుకువచ్చి పరిశ్రమను రక్షించాలి.

(వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
సెల్‌ : 9849431258)
పిల్లలమర్రి బాలకృష్ణ

పిల్లలమర్రి బాలకృష్ణ