Apr 03,2023 21:43

దీక్షలో మాట్లాడుతున్న చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : చేనేత సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి జింకాచలపతి విమర్శించారు. చేనేతల సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మికసంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట 36 గంటల దీక్షను చేపట్టారు. ఈదీక్షలో చేనేత నాయకులు జింకాచలపతి, వెంకటస్వామి, రమణ, మంజునాథ్‌, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షకు ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌, నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 11 రకాల రిజర్వేషన్‌ చట్టం అమలు డిమాండ్‌లో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఎందుకు కాలయాపన చేసున్నారో అర్థం కావడంలేదన్నారు. రిజర్వేషన్‌ చట్టం అమలులో ఎమ్మెల్యే అడ్డంకులు తెలపడం దారుణమన్నారు. పవర్లూమ్‌ యాజమాన్యంతో ఎమ్మెల్యే కుమ్మక్కై జీవోను అమలుచేయడంలేదని ఆరోపించారు. చేనేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలు లేకుండా చేయాల్సిన బాధ్యత కలెక్టర్‌ది కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇప్పటివరకు చేనేత కార్మికులకు చేసింది శూన్యమన్నారు. భవిష్యత్తులో చేనేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలన్నారు. చేనేత సమస్యలు పరిష్కరించకుంటే ఎమ్మెల్యే ఇంటిముందు,కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మికసంఘం తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ, పట్టణ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.
చేనేత దీక్షకు జనసేన మద్దతు : చేనేతల సమస్యలపై దీక్ష చేపడుతున్న చేనేత నాయకులకు జనసేన పార్టీ రాష్ట్రప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి తన మద్దతుతెలిపారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్‌రెడ్డి ్డ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. గతంలో వస్తున్న పథకాలను వైసీపీ రద్దు చేసి కార్మికుల పొట్టను కొట్టిందని విమర్శించారు.