Apr 13,2023 18:26

భాదితులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్యెల్యే

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : చేనేత కార్మికుల ఆత్మహత్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనపడలేదా అని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ప్రశ్నించారు. గురువారం పట్టణంలోని నీరుగట్టువారిపల్లి, చౌడేశ్వరివీధి -4లో నివాసముంటున్న వెంకటేష్‌ అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సంవత్సరానికి ఒకసారి నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.24 వేలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొంటోందని విమర్శించారు. 80 శాతం మంది కార్మికులకు అందడం లేదన్నారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని, వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని పేర్కొన్నారు. చేనేత కార్మికులు ఎవరు అధైర్య పడవద్దని, వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం ఎపి బిసి సంక్షేమ సంఘం చేనేత యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఓర్సు వీరభాస్కర్‌ మాట్లాడుతూ రేషం వార్పులు, జరీలు అధిక ధరలు పెరగడం వల్ల పనులు లేక కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. చేనేత కార్మికులు రోజు రోజుకి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబానికి దహనక్రియలు సమయంలో రూ.20 వేలు ఇవ్వాలనీ, కుటుంబానికి రూ.20 లక్షలు విలువచేసే బీమాను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గిరీష్‌ కుమార్‌, ఇంతియాజ్‌, అమర, బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు రమేష్‌ నాయుడు, బాబ్‌ జాన్‌, మోహన్‌ పాల్గొన్నారు.