Mar 29,2023 22:57

నారా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్న జనం

ప్రజాశక్తి - సోమందేపల్లి : సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని సోమందేపల్లి మండల చేనేతలు నారా లోకేష్‌ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. యువగళం పాదయాత్రలో యువనేతను కలిసిన చేనేత, మరమగ్గాల కార్మికులు తమ సమస్యలు విన్నవించారు. సోమందేపల్లిలో 6వేల కుటుంబాలు చేనేత, మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. చేనేత పని తప్ప మరే పని తెలియని చేనేత కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో సోమందేపల్లిలో 1350 మందికి పట్టు రాయితీ సబ్సిడీ అందేదనిప్రస్తుతం వివిధ కారణాలు చూపించి కేవలం 300 మందికి మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. నేతన్న నేస్తం పథకం ఇస్తున్నామన్న సాకుతో సుమారు వెయ్యిమందికి పైగా పట్టు రాయితీ కట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగి, కొనుగోలు శక్తి పడిపోయి చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.చేనేతలకు ఉచిత విద్యుత్‌, ఉచిత ఆరోగ్య బీమా పథకాలను కూడా పూర్తిగా రద్దుచేశారన్నారు.వైసిపి ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ చార్జీలు పెంచడంతో గతంలో రూ.500 నుంచి రూ.1000 వచ్చే కరెంట్‌ బిల్లు ప్రస్తుతం రూ.2వేల నుంచి రూ.3వేలవరకు వస్తోందని వాపోయారు. కుటుంబాన్ని పోషించలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే, పరిహారం అందజేయకపోగా, కనీసం పరామర్శించే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి అండగా నిలవాలని కోరారు. స్పందించిన లోకేష్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వినాయక్‌ నగర్‌ లో గల బాబ్జాన్‌ చేతి మగ్గాలను పరిశీలించి వారి సమస్యలను అడిగిన తెలుసుకొన్నారు. లోకేష్‌ పాదయాత్రలో బ్రాహ్మణ సంఘ నాయకులు కలిసి వారి సమస్యలను విన్నవించారు. అదే విధంగా జగ్జీవన్‌ రావు నగర్‌ దళితులు లోకేష్‌ ను కలిసి వారి సమస్యలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, గుండుమల తిప్పేస్వామి అంబికా లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్‌ సిద్ద లింగప్ప తదితరులు పాల్గొన్నారు.