Jul 05,2023 21:53

మాట్లాడుతున్న పోలా రామాంజనేయులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, ఈ పరిశ్రమ కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వెంటనే చేనేత పాలసీని అమలు చేయాలని ఎపి చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు డిమాండ్‌ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరునెలల నుంచి చేనేతపరిశ్రమ మరింత తీవ్రసంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. ముఖ్యంగా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు నిధులు కేటాయించి ఎలా ఆదుకుంటారో, అలాగే చేనేతకు విపత్తు వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని వస్త్రాలను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. చేనేత పరిశ్రమ దెబ్బతినడానికి కారణం చేనేత రకాలను పవర్‌లూమ్స్‌లో నేయడం వల్లనేనని అన్నారు. సిఎం జగన్‌ అన్ని విషయాలు మాట్లాడుతున్నారే కానీ చేనేత పరిశ్రమ గురించి మాట్లాడలేదన్నారు. చేనేత కార్మికుని కుటుంబానికి రూ.1లక్ష రుణం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమ సంక్షోభం నుండి బయటపడటానికి రూ.1000 కోట్లు చేనేత పరిశ్రమకు కేటాయించాలన్నారు. ధర్మవరం నుంచి ఇతర ప్రాంతాలకు చీరలు అప్పుగా ఇచ్చినప్పుడు తిరిగి వాటి బకాయిలు వసూలు చేసేటప్పుడు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో చేనేత పరిరక్షణ కోసం ఒక సెల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్‌ ఆదినారాయణ, జంగాలపల్లి పెద్దన్న, నాగార్జున పాల్గొన్నారు.