Jan 20,2023 18:35

క్రీడాజ్యోతి వెలిగిస్తున్న భానుమూర్తి రాజు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వ్యాయామ విద్య రాష్ట్ర ఇన్‌ఛార్జి భానుమూర్తిరాజు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ చైతన్య పాఠశాలలో ఎజిఎం రమణయ్య, ప్రిన్సిపల్‌ ఆకేపాటి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్‌ విద్యార్థులకు పలు క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భానుమూర్తి రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సర్వతో ముఖాభివృద్ధి చెందుతారన్నారు. క్రీడల వలన ఆరోగ్యంతో పాటు దేహదారుఢ్యం, మానసిక వికాసం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి విద్యా, ఉద్యోగాలలో కోటా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను క్రీడలలో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ అనూష, డీన్‌ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, ప్రైమరీ ఇన్‌ఛార్జి కస్తూరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.