గాండ్లపెంట : అనాటి సమాజంలో వేల్లూనుకున్న సామాజిక రుగ్మతలు, అసమానతలను పారదోలి ప్రజలను చైతన్య వంతం చేసేలా మహాకవి యోగి వేమన తన సాహిత్యంతో పద్యాలు రచించారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కె.రోజా పేర్కొన్నారు. గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి వద్ద శ్రీ యోగి వేమన రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. వేమన సమాధి, ఆలయాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం జడ్పీ హైస్కూల్ ఆవరణలో జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, శంకర్ నారాయణ, కలెక్టర్ బసంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ వేమన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భావి తరాలకు స్ఫూర్తిగా వేమన సాహిత్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సంకల్పించారన్నారు. 350 సంవత్సరాల క్రితం మహాకవి వేమన పద్యాలు నేటికీ ఎంతో ప్రాచుర్యాన్ని పొందుతున్నాయంటే అందులోని గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. అనాటి సమాజంలోని రుగ్మతలను పారదోలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన పద్య రచన శైలితో యోగివేమన చైతన్యవంతం చేశారన్నారు. వేమన పద్యాల సారాంశాలను తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలన్నారు. వేమన పద్యాలు లోక నీతులని, సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణమని తెలిపారు. సామాజిక, కుటుంబ వ్యవస్థల్లోని లోటుపాట్లు, సామాజిక అస్థవ్యస్థత, సామాజిక జీవనంలోని ప్రతి అంశం మీద వేమన పద్యాలు చెప్పారని వారు చెప్పారన్నారు. గాండ్లపెంట మండలాన్ని ఇకనుంచి శ్రీ యోగివేమన కటారుపల్లి మండలంగా నామకరణ చేయడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు. కటారుపల్లికి తారు రోడ్డు పనులకు టెండర్లు పిలిచామని, ఫిబ్రవరి మాసం నుంచి రోడ్డు పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట్లాడుతూ లోకకవి వేమన అన్నారు. వేమన రచనలు ఆంగ్ల, ఐరోపా భాషలలో అనువదించారన్నారు. కలెక్టర్ బసంత్‌కుమార్ మాట్లాడుతూ వేమన పద్యాలు వినని తెలుగు వారు లేరంటూ అతిశయోక్తి కాదన్నారు. ఆయన రాసిన ప్రతి పద్యం ఒక ఆణిముత్యం అని తెలిపారు. అనంతరం యోగి వేమన వంశస్తులు టి.వేమారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, చెన్నారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలను మంత్రి సన్మానించారు. ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రెడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కాపు భారతి, ఎంపిపి జగన్, వైసిపి మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, టూరిజంశాఖ అధికారులు నాగేశ్వర్ రెడ్డి, డివిఎం.ఈశ్వరయ్య, తహశీల్దార్ రవి, ఎంపిడిఒ ఆంజనేయ, జెడ్పీటీసీ అమరావతి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎస్.ఫయాజ్ అలీ, వైఎస్ ఎంపిపి గంగోజమ్మ, సర్పంచి గంగోజమ్మ రవీంద్ర నాయక్, యోగి వేమన రెడ్డి సంఘం ప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.










