Apr 08,2022 22:02
  • విశాల ప్రాతిపదికన ఐక్య ఉద్యమాలు

ఇకె నయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. సిపిఎం అఖిల భారత మహాసభ మూడవ రోజు శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజకీయ తీర్మానంపై చర్చలు జరుగుతున్న తీరుతోపాటు వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా, రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తూ ఉన్నా, హక్కులపై దాడులు చేస్తున్నా వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేసిందని, కరోనా వంటి కష్టకాలంలో ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచిందని అన్నారు. ఆ విధానాల ఫలితంగానే ప్రజలు గత ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని చేకూర్చారని అన్నారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యామ్నాయ విధానాల మిగతా రాష్ట్రాలకు అనుసరణీయమని, వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు.
వివిధ రకాల ప్రజా సమస్యలపై విశాల ప్రాతిపదికన ఐక్య ఉద్యమాలు నిర్మించేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ దిశగా పలు వేదికలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. రైతాంగ ఉద్యమంలో ఎన్ని రకాల శక్తులు, సంస్థలు భాగస్వామ్యమయ్యాయో చూశాం. బిజెపి మతతత్వ ఎజెండాకు ప్రతిఘటన సిఎఎ వ్యతిరేక ఆందోళనతో మొదలైంది. దానిలోనూ బహుముఖ భాగస్వామ్యం ఉంది. దేశ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న బిజెపిని ఒంటరిపాటు చేసే పోరాటంలోనూ ఇటువంటి శక్తులన్నీ పాలుపంచుకోవాలి. లౌకికతత్వాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా వేదిక అవసరమన్నారు.
ప్రజలను, దేశ సంపదను కొల్లగొట్ట్టి కార్పొరేట్లకు కట్టబెడుతూ, ఆ విధానాలను ప్రజలు ప్రతిఘటించకుండా తప్పుదోవ పట్టించే విధంగా మత ప్రాతిపాదికన చీలుస్తోంది కనుక బిజెపిని ఓడించాలి. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఉన్న లౌకిక, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఏక తాటిపై నిలవాలన్నారు. బిజెపి కార్పొరేట్‌- హిందూత్వ విధానాలను తిప్పికొట్టేందుకు బహుళ శక్తులతో కూడిన విశాల వేదిక అవశ్యమన్నారు. ఇది కూటమి (ఫ్రంట్‌)గా కాదు, వేదిక (ఫోరమ్‌)గా ఉంటుందని ఆమె వివరించారు.
బిజెపిని ఓడించే విషయంలో కాంగ్రెస్‌ పాత్రకు సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రాజకీయ తీర్మానంలోగానీ, పార్టీలోగానీ ఎటువంటి అయోమయమూ లేదు. మతోన్మాదాన్ని వ్యతిరేకించడం, లౌకిక విలువల పరిరక్షణ వంటి అంశాల్లో ఎవరికైనా గందరగోళం ఉంటే వారు దానిని సరిదిద్దుకోవాలని ఆమె అన్నారు.
తృణమూల్‌, శివసేన వంటి పార్టీల గురించి అడిగిన ఒక ప్రశ్నకు బృందాకరత్‌ సమాధానమిస్తూ మీరు ఎన్నికల వరకే పరిమితమై ఆలోచిస్తున్నారు. మేం దానికి మించి ఆలోచిస్తున్నామన్నారు. ఎన్నికల అంశానికి వస్తే బిజెపి వ్యతిరేక ఓటు చీలకూడదని, ఆ వ్యతిరేక ఓటు గరిష్టంగా ఒకే చోట పోగవ్వాలన్నది మా పార్టీ ఆలోచన అని బృందా చెప్పారు. భారతదేశం అంటేనే భిన్నత్వం. దీనిని ఎలా ఆచరణలోకి తేవాలన్నది ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని, అంతిమంగా ప్రజలు గెలవాలనే కోరుకుంటామని అన్నారు.
సిల్వర్‌లైన్‌ ప్రాజెక్టు విషయంలో పర్యావరణాన్ని కాపాడుతూ, నిర్వాసితులకు గరిష్ట ప్రయోజనం కల్పించేలా చూడడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నిజానికి బిజెపి ప్రభుత్వం పర్యావరణ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించింది. బిజెపి పాలిత రాష్ట్రాలు కీలకమైన పర్యావరణ ప్రభావ నివేదిక అవసరం లేదంటూ చట్టాలు చేశాయి. ఈ చర్యలను మీరు ప్రశ్నించాలి. కేరళ ప్రభుత్వం అలా చేయడం లేదు. పైగా కేరళ సమగ్రాభివృద్ధికి ఈ ప్రాజెక్టు అత్యవసరం. కాంగ్రెస్‌, బిజెపి ఉద్దేశపూర్వకంగానే దీనిపై దుష్ప్రచారానికి దిగుతున్నాయని అన్నారు.

  • రాజకీయ తీర్మానంపై చర్చలు పూర్తి

అత్యంత కీలకమైన ముసాయిదా రాజకీయ తీర్మానంపై మహాసభ చర్చలు పూర్తయ్యాయని ఆమె చెప్పారు. తొలి రోజు 18 మంది, రెండో రోజు 17 మంది చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. మహాసభకు ముందు వచ్చిన 4001 సవరణలు కాకుండా, మహాసభలో ప్రతినిధులు 390 సవరణలు, 12 సూచనలు ఇచ్చారని తెలిపారు.