Jul 19,2022 22:54

ప్రజాశక్తి-గన్నవరం: మండలంలోని తెంపల్లిలో కలరా సోకినట్లుగా తెలుస్తోంది. కలుషిత నీటిని లేబరేటరీలో పరీక్షించగా కలరా లక్షణాలు ఉన్నట్లుగా బయట పడిందని సమాచారం. ఈ విషయాన్ని అధికారులు ఎవరూ బయటకు చెప్పడంలేదు. అయితే బాధితులకు గన్నవరం సమీపంలోని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డు సిద్ధం చేయమని జిల్లా అధికారి ఒకరు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిసింది. ఇప్పటికే గ్రామంలో బట్టా శ్రీ రాములు (85), పలపోటు వెంకటరావమ్మ (70), నాగబోయిన రాఘవేందర్‌రావు (35), చింతల చింతయ్య (80), కొలుసు మహేష్‌ (65) మృతిచెందారు. వీరంతా విషజ్వరాలు, అతిసార వల్ల మరణించి ఉంటారనే భావన గ్రామంలో ఉంది. విజయవాడలో చికిత్స పొందుతున్న బాధితులు పరిస్థితి నాలుగు రోజులు గడిస్తే గానీ చెప్పలేమని వైద్యులు చెప్పినట్లుగా తెలిసింది. కలరా ప్రభావం ఉంటే రోజుల వ్యవధిలోనే ప్రాణం మీదకు వస్తుందని రోగుల బంధువులు భయపడుతున్నారు. గ్రామంలో వాంతులు విరోచనాలతో 70 మంది వరకు చికిత్స పొంది ఇళ్ల వద్ద ఉంటున్నారు. వారిలో 60 సంవత్సరాలు పైబడినవారు 25 మంది వరకూ ఉన్నారు. కలరా ప్రభావం 60 సంవత్సరాలు పైబడిన వారి పై తీవ్రంగా ఉంటుంది. మరణించిన వారిలో ఒకరు తప్ప నలుగురు 60 సంవత్సరాలు పైబడిన వారే కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో గ్రామంలో ఎప్పుడు ఎవరి ప్రాణం ఎందుకు వస్తుందో తెలియడంలేదని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
గ్రామంలో వాటర్‌ లైన్‌ ఏర్పాటు
జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆదేశాల మేరకు తెంపల్లి గ్రామంలో వాటర్‌ లైన్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. యాదవుల కాలనీ ఏరియాలో వాటర్‌ పైపులను రోడ్డుపైన ఓపెన్‌ గా నడుపుతున్నారు. భూమి లోపల వేస్తే పగిలి నీరు కలుషితమై డానికి అవకాశం ఉందని, కొత్త లైను అందరికీ కనపడేలా పైన ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల్లో పైపుల నిర్మాణం పూర్తి చేసి రక్షిత ట్యాంక్‌ నుండి నీటిని వదులుతామని పంచాయతీ అధికారులు తెలిపారు. అప్పటివరకూ వాటర్‌ ట్యాంకర్ల ద్వారా వీళ్లకు నీటిని సరఫరా చేస్తామని అంటున్నారు. గ్రామస్తులు అందరూ నీటిని కాచి, చల్లార్చి తాగాలని ఆరోగ్య కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. మరోపక్క పంచాయతీ సర్పంచ్‌, అధికారులు పారిశుద్ధ్య కార్మికుల తో గ్రామం అంతటా బ్లీచింగ్‌ సున్నం చెల్లిస్తున్నారు. మురుగు డ్రైనేజీలో దోమలు లేకుండా మందు కొట్టిస్తున్నారు. వైద్య అధికారులు మెడికల్‌ క్యాంపు కొనసాగిస్తున్నారు. ఎంపీడీవో సుభాషిణి, ఈఓపిఆర్‌డి వెంకటేశ్వరరావు, ఈవో నామేశ్వరరావు పైపులైన్ల నిర్మాణ పనులను పరిశీలించారు.