Dec 14,2022 22:11

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

       పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు ఇసుక కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం నాడు-నేడు, గహ నిర్మాణ పనులకు ఇసుక సరఫరా చేయాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఇసుక సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకొని పనులు వేగవంతంగా జరిపించాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో ఇసుక సిద్ధంగా ఉంచాలని కమిషనర్లను ఆదేశించారు. హిందూపురం మండలం తూముకుంట గ్రామం వద్ద పెన్నా నదిలో 3.590 హెక్టార్లలో ఓపెన్‌ ఇసుక రీచ్‌కు, పరిగి గ్రామం వద్ద సర్వే నెంబర్‌ 566 లో 2.6 హెక్టార్లలో ఓపెన్‌ రౌండ్‌ రీచ్‌కు, కోడిగిన హళ్లి గ్రామం వద్ద సర్వేనెంబర్‌ 2లో 3.9 హెక్టార్లలో ఒకరీచ్‌ ఏర్పాటుకు కమిటీ సమావేశంలో అనుమతులు జారీ చేసింది. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రామకష్ణ ప్రసాద్‌, మైన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పాపారావు, జిల్లా డిపిఒ విజరు కుమార్‌, పర్యావరణ ఇంజనీర్‌ శంకర రావు, ఐబి డివిజన్‌ ఇఇ ప్రతాప్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ రషీద్‌ ఖాన్‌, భూగర్భ జలవనరులశాఖ అధికారి రాజశేఖర్‌ రెడ్డి, మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ శివశంకర్‌, జేపీ కంపెనీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
విలువలతో కూడిన విద్య బోధన అందించాలి : కలెక్టర్‌
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో విద్యా బోధనలో విలువలు అనుసంధానం పై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రశాంతి నిలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రశాంతి నిలయం అత్యంత లౌకిక ప్రవేశమన్నారు. సాయి విద్యాసంస్థల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని చెప్పారు. ఈ శిక్షణ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విలువలతో కూడిన విద్యను అందించడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందన్నారు. సత్యసాయి లోగో అన్ని మతాలకు ప్రతిబింబంగా ఉంటుందన్నారు. సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌ మాట్లాడుతూ పిల్లల్లో పరివర్తన తీసుకురావడానికి ఆరు దశాబ్ధాల క్రితమే సత్యసాయి బాలవికాస్‌ను ప్రారంభించారన్నారు. పిల్లల భవిష్యత్తు విలువలు ఎంత ముఖ్యమో బాబాకు తెలుసని, ఈరోజు ప్రభుత్వం కూడా విలువలతో కూడిన విద్యను అందించేందుకు ముందుకు రావడం శుభ పరిణామన్నారు. అనంతరం విద్యా బోధనలు విలువల అనుసంధానంపై వివిధ కరదీపికలను కలెక్టర్‌, ఆర్‌జె.రత్నాకర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌రావు, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణమూర్తి, ఉపాధ్యాయులు శశి పాల్‌, శకుంతల పాల్గొన్నారు.