ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు అర్ధనగ ప్రదర్శనతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భ.ని.కా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సాంబశివ, సిఐటియు మండల కార్యదర్శి గౌస్‌లాజాం మాట్లాడుతూ 2009లో పోరాడి సాధించుకోన్న సంక్షేమ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. కూలి చేసుకునే కార్మికుల కడుపు కొడుతూ, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు నుంచి ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించిన రూ.1,280 కోట్లు వాడుకోవడం బాధాకరమన్నారు. ఆ నిధులు జమ చేసి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న క్లైమ్‌లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇసుక మాఫియాను అరికట్టి ఇసుకను ఉచితంగా ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ బసంత్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భ.ని.కా సంఘం జిల్లా అధ్యక్షుడు జె.రామకష్ణ, కోశాధికారి ముత్యాలు, కార్మికులు బాబయ్య, మురఫ్, వెంకటేశు, సుధాకర్, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ హమీద్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమ బోర్డులను నిర్వీరం చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నామన్నారు. వెంటనే భవన నిర్మాణ కార్మిక చట్టాలను అమలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప , భవననిర్మాణ కార్మిక సంఘం నాయకులు మూర్తి, నాగరాజు, శ్రీరాములు, అంజి, ముత్యాలు, కెవిపిఎస్ నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండలో జూనియర్ అసిస్టెంట్ హమీద్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు, భవన నిర్మాణ కార్మికులు










