Jun 21,2023 20:04

మాట్లాడుతున్న అల్లాడి గోపాల్‌

ప్రజాశక్తి-కందుకూరు :భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల గత నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్లాడి గోపాల్‌ విమర్శించారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు మరణించినప్పుడు గానీ, ప్రమాదాలు జరిగినప్పుడు గానీ సంక్షేమ బోర్డు నిధుల నుంచి ఇవ్వాల్సిన సహాయం ఇవ్వకపోగా, ముఖ్యమంత్రి తమ స్వలాభం కోసం అనేక ప్రభుత్వ పథకాలకు భవన నిర్మాణ కార్మికుల సొమ్మంతా దారిమళ్లిస్తూ, భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో 600 మందికి పైగా కార్మికుల క్లెయిమ్‌లను పెండింగ్‌లో ఉంచారన్నారు. వెంటనే వాటిని పరిష్కారం చూడాలన్నారు. సమావేశంలో కందుకూరు,గుడ్లూరు, వలేటివారిపాలెం, ఉలవపాడు మండలాల సిఐటియు నాయకులు ఎస్‌.ఏ గౌస్‌.జి వెంకటేశ్వరు ్ల,జివిబికుమార్‌, ఎస్‌. డి.గౌస్‌ భాషా పాల్గొన్నారు.