భవిష్యత్తులో పయాణికులకు ఇబ్బందికరం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న మున్సిపల్ బస్టాండ్ ప్రయాణికులకు వేచి ఉండేందుకు సరైన సదుపాయాలు లేవని వాటి స్థానంలో మున్సిపాలిటీకి ఆదాయం పెంచుకునేందుకు రూములు నిర్మించారే తప్ప ప్రయాణికులకు అనుకూలంగా లేవని జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా కౌలురైతు సంఘం ఉపాధ్యక్షులు గంట లక్ష్మీపతి పేర్కొన్నారు. శనివారం నిర్మాణం చేపట్టనున్న మున్సిపల్ బస్టాండ్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల వసతి గృహం చిన్నదిగా ఉందని, అత్యధిక భాగం రూములు నిర్మించి ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు సరైన సదుపాయాలు లేవని వాటి స్థానంలో పురపాలక సంఘ ఆదాయాన్ని పెంచుకునేందుకు రూములు నిర్మించారని ఇలా నిర్మించడం వల్ల భవిష్యత్తులో ప్రయాణికుల అవసరానికి తగిన విధంగా బస్ షెల్టర్ ఉండదన్నారు. ఈ నిర్మాణాన్ని మరొకమారు పరిశీలించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజల తోటి చర్చించాలని వారు అధికారులకు సూచించారు.










