Aug 18,2021 06:13

ఐపిసిసి శాస్త్రీయ నివేదిక పర్యావరణ ముప్పుపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వాతావరణంపై ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రానున్న రెండు, మూడు దశాబ్దాల్లో 1.5 నుండి 2 డిగ్రీల సెల్సియస్‌ దాకా భూతాపం పెరగనున్నట్లు తేల్చి చెప్పింది. అలా అయితే ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా ప్రకతి వైపరీత్యాలు, సముద్రపు నీటిమట్టాలు పెరగడం వంటివి సాధారణమై, మనుగడ దుర్భరమౌతుంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలలా అన్ని దేశాల్లో అసాధారణ వర్షాలు, కరువులు, వరదలు, పంటల నష్టాలూ, కార్చిచ్చులూ అధికమయ్యాయి. ఒకప్పుడు 1970లలో ఏటా 1.5 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే సముద్ర నీటిమట్టం నేడు ఏటా 3 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతూ వస్తోంది. ఏభై సంవత్సరాల్లో పెరిగే ఉష్ణోగ్రత 10 సంవత్సరాలకే పెరుగుతూ వస్తోంది. భారత్‌లో కూడా హిమాలయాల మంచు కరగడం, వరదలు సంభవించడం అధికమయ్యింది. భూతాపం పెరగడంలో మొదటి ముద్దాయి మానవుడు. ప్రకృతిని ఆషామాషీగా తీసుకోవడం, విధ్వంసాన్ని అభివృద్ధిగా భావించడం వల్ల భూగోళం వేడెక్కసాగింది. వాతావరణాన్ని ఎక్కువ నష్టపరుస్తున్నవి కర్బన ఉద్గారాలు. ఈ పాపానికి తొలి వరుస ముద్దాయిలు అభివృద్ధి చెందిన దేశాలు. కేవలం మూడు సంపన్న దేశాలు, (చైనా, అమెరికా, యూరోప్‌ సమాఖ్య) విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాలు మొత్తం వాటిలో 46 శాతం. కింది 100 దేశాల వాటా 3 శాతం మాత్రమే. అంటే వాటికంటే 16 రెట్లు ఎక్కువ ప్రపంచానికి నష్టం చేకూరుస్తున్నాయి. పోనీ అందుకు తగ్గ బాధ్యత పడతన్నాయా అంటే అదీ లేదు. మిగతా దేశాలకు ఉద్గారాలు తగ్గించడానికి అవసరమైన సాయమూ, టెక్నాలజీ అందించింది లేదు. చెయ్యాల్సిన నష్టమంతా చేసి భాద్యత మాత్రం అందరం సమానంగా పంచుకోవాలంటూ ఉద్బోధలు చేస్తున్నాయి. అది వర్ధమాన దేశాలకు భారంగా తయారౌతుంది. తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ఉద్గారాల్ని సున్నా స్థాయికి తేగలిగితేనే రానున్న ప్రమాదానికి బ్రేకులు పడతాయి. ధనిక దేశాలు తప్పించుకొనే ధోరణి మాని అందరి తరపునా భాద్యత తలకెత్తుకుంటేనే అది సాధ్యం. ప్రస్తుతం ఆ భరోసా లేదు. మిగతా ప్రపంచదేశాలు ఒక్కటై వాటిని ఒప్పందానికి కట్టుబడేలా చెయ్యాలి. భారత్‌ పర్యావరణ పరిరక్షణకు నాయకత్వం వహించాలి. పొంచివున్న ముప్పు తీవ్రతను గుర్తెరగాలి.
 

- డా|| డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.