Aug 28,2023 23:06

అధికారికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు, కార్మికులు

పజాశక్తి - తిరువూరు : తిరువూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్‌ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు డిమాండ్‌ చేస్తూ తిరువూరు ఆర్డీవో ఆఫీస్‌ ముందు ఆందోళన చేశారు. అనంతరం ఎఒ నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈసంద ర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భూపంపిణీ కూడా పెట్టి పదో నవరత్నంగా చేర్చి భూపంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పేద ప్రజల సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలని, ప్రధానంగా అటవీ, పోరంబోకు, వాగు, సీలింగ్‌ భూములు, రెవెన్యూ ఫారెస్ట్‌ భూములకు ప్రభుత్వం సాగుదారులకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరువూరు డివిజన్‌ పరిధిలో తిరువూరు, విస్సన్నపేట, ఏ కొండూరు, గంపలగూడెం, రెడ్డిగూడెం మండలాల్లో సుమారుగా వందలాది ఎకరాల భూమిని పేదల సాగు చేసుకుంటున్నారని, వారికి పట్టాలు ఇవ్వాలని అధికారులకు వినతిపత్రం ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, రైతుసంఘం నాయకులు ఆలీబాబా, జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, విస్సన్నపేట సాగుదారులు లాజరస్‌, రమేష్‌, ప్రసాద్‌, కిషోర్‌, మారయ్య, కనకపూడి రాజు,. విస్సన్నపేట, తెల్లదేవరపల్లి, తాత కుంట్ల, పుట్రెల, మల్లెల, తిరువూరు, వామకుంట్ల, ఎర్రమడు, అనుములంక, సుబ్బాల, ఏ కొండూరు తదితర గ్రామాల నుండి భూ సాగుదారులు పాల్గొన్నారు.