Mar 03,2023 22:22

ఫొటో : మాట్లాడుతున్న బాధితులు

భూసమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం
ప్రజాశక్తి-కావలి : మండల పరిధిలోని చలంచర్ల గ్రామం పరిధిలోని పెద్దారంలో భూసమస్య పరిష్కరించడంలో అధికారులు నిర్లక్యం వహించగా, వేసుకున్న జామాయిల్‌ అక్రమంగా నరికి వేయగా, ఓ నిరుపేద రైతు కుటుంబం వీధిన పడింది. వైసిపి ఆగడాలు తట్టుకోలేక ఆ కుటుంబం శుక్రవారం రైల్వే స్టేషన్‌ రోడ్డులోని ''జర్నలిస్ట్‌ క్లబ్‌''ను ఆశ్రయించి తమ గోడును మీడియా ప్రతినిధులతో వెళ్లబోసుకొంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి చెందిన బొబ్బల కొండయ్య మాట్లాడుతూ తాను గత 25 సంవచ్చరాలకు పైగా సర్వే నెంబర్‌ 841లో శివాయి భూమిలో 5 ఎకరాలు సాగు చేసుకుంటూ, తాను జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ఈ భూమినీ తనఖాకు కొండయ్య కుటుంబం తమ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఇరువూరి శ్రీహరి నాయుడు, తిరుపతయ్య రాజకీయ పలుకుబడితో తన పొలంలో సాగు చేసుకొన్న చేతికొచ్చిన జామాయిల్‌ పంట అక్రమంగా నరికి వేసేందుకు సహకరించారని వాపోయారు.
ఈ సమాచారాన్ని కావలి తహశీల్దార్‌కు, రూరల్‌ పోలీసులకు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకొని వెళానని, అయినా పరిష్కారం కాలేదని విలపించాడు. తన ఇద్దరు కుమారులు తనకు చేదోడు వాదోడుగా ఉంటారని భావిస్తే విధి తనకు దూరం చేసిందని, ఇందులోనూ వైసిపి నాయకులు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం అందకుండా చేశారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదంతా ఎంఎల్‌ఎ అండదండలతో చేస్తున్నారని, ఇక తన భూమి తనకు దక్కడం సాధ్యం కాదని భావించి పురుగులు మందు తాగి, ఆత్మ హత్యే శరణ్యమని పురుగుల మందు చేతపట్టుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందులో బాధిత కుటుంబానికి చెందిన బొబ్బల అనసూయమ్మ, కోడళ్లు వైదేవి, అనిత, బంధువులు చింతం కల్లయ్య, సబ్బయ్య ఉన్నారు.