Nov 07,2023 22:59

ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో జాతీయ రహదార్లులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాల కోసం సేకరించిన భూముల రైతులకు త్వరితగతిన సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ వంగా గీత అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్‌ కృతికా శుక్లా ఎంపీ గీత జాతీయ రహదారులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌లకు అవసరమైన భూసేకరణ, సంబంధిత అంశాలపై రెవెన్యూ, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, సర్వే, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ జిల్లాలో వాకలపూడి నుంచి అచ్చంపేట మీదుగా జాతీయ రహదారి-516, పిఠాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ సత్వరం పూర్తిచేసి త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత మేరకు రైతులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలని, సేకరించిన భూములకు సకాలంలో సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌లకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఇందుకు రెవెన్యూ, సర్వే, ఎన్‌.హెచ్‌ అధికారులు ఉమ్మడిగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రధానంగా సామర్లకోట ఎడిబి రోడ్‌ నుంచి రాజానగరం వరకు నిర్మిస్తున్న రహదారి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.