Jan 23,2023 21:43

రైతులతో కలిసి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న

           ప్రజాశక్తి-బత్తలపల్లి   బత్తలపల్లి మం డలం మీదుగా జరుగుతున్న హైవే, బైపాస్‌ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక కార్యాలయం ముందు తహశీల్దార్‌ యుగేశ్వరిదేవికి రైతులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బత్తలపల్లి మండలం రాఘవంపల్లి నుంచి గంటాపురం వరకు బైపాస్‌ రోడ్డుకు, బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ వరకు జాతీయ రహదారి విస్తరణకు అధికారులు భూసేకరణ చేపట్టారన్నారు. ఈ ప్రాంతంలో ఒక ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మార్కెట్‌ విలువ ఉందన్నారు. కానీ ప్రభుత్వం ఎకరాకు కేవలం రూ.30లక్షలు ఇస్తామని అధికారులు అంటున్నారన్నారు. దీంతో రైతులు భూములను ఇచ్చేందుకు సుముఖంగా లేరన్నారు. కావున ప్రభుత్వం రైతులకు రూ.కోటి ప్రకారం నష్టపరిహారం చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తర్వాత ఎంపిడిఒ గాయి మనోబార్‌కు కూడా వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కమిటీ నాయకులు జెవి.నాయుడు, జె.రామచంద్ర. మండల కార్యదర్శి పోతలయ్య, రైతులు నాగభూషణ, అయ్యస్వామి, కృష్ణయ్య, ఈశ్వరయ్య, జయరాములు, తదితరులు పాల్గొన్నారు.