Apr 27,2023 21:37

భూములకు త్వరగా పరిహారం చెల్లించాలి : గిరీష

రాయచోటి: జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు ఎన్‌హెచ్‌ 71 మదనపల్లి నుండి పీలేరు, ఎన్‌హెచ్‌ 71 కడప నుండి రేణిగుంట మార్గంలో రాజంపేట డివిజన్‌ పరిధిలో ఇప్పటికే సేకరించి అవార్డు పాస్‌ చేసిన భూములకు వేగంగా పరిహారం పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారులకు సేకరించిన భూములకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం చెల్లింపు అంశంపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎన్‌హెచ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌హెచ్‌ 71 కింద మదనపల్లి నుంచి పీలేరు వరకు వాయల్పాడు, కలికిరి, మదనపల్లి, పీలేరు నాలుగు మండలాల్లో సేకరించిన భూములకు సంబంధించి అవార్డ్స్‌ పాస్‌ చేసిన వాటిలో 84 శాతం పరిహారం చెల్లింపు చేశారన్నారు. వచ్చే వారంలోగా 90 శాతం మేర తప్పనిసరిగా చెల్లింపులు పూర్తి చేయాలని సంబంధిత తాసిల్దార్లు, ఆర్డీఓను ఆదేశించారు. అదనంగా అవార్డ్స్‌ పాస్‌ చేసిన వాటిలో 61 శాతం మేర చెల్లింపులు చేశారని, ఇందులో కూడా వచ్చే వారంలోగా 80 శాతం మేర పరిహారం పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఎన్‌హెచ్‌ 716 కింద కడప నుంచి రేణిగుంట మార్గంలో రాజంపేట డివిజన్‌కు సంబంధించి 72 కిమీల మేర నిర్మిస్తున్న జాతీయ రహదారిలో నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి పుల్లంపేట, రైల్వేకోడూరు 5 మండలాల్లోని 24 గ్రామాల పరిధిలో ఇప్పటికే సేకరించిన భూములకు సంబంధించి పరిహారం చెల్లింపు అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. లబ్ధిదారులకు త్వరితగతిన పరిహారం చెల్లించేందుకు తహశీల్దార్లు కషి చేయాలన్నారు. ఈ విషయాన్ని తహశీల్దార్లతో ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయాలని సబ్‌ కలెక్టరుకు సూచించారు. ఆయా అంశాలలో పెండింగ్లో ఉన్న ఫైల్స్‌పై వెంటనే నివేదికల రూపొందించి తదుపరి మంజూరు నిమిత్తం కలెక్టరేటుకు పంపించాలని సూచించారు. కోర్టు కేసులు మినహా అన్ని పైల్స్‌ వచ్చే వారంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని చెప్పారు. భూసేకరణ జరిపిన లబ్ధిదారులలో కొంతమంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారని తాసిల్దార్లు కలెక్టరుకు వివరించారు. వీఆర్వోలు గ్రామాలలో విచారించి సంబంధిత లబ్ధిదారుల చిరునామాలు కనుగొని సమాచారం అందజేసి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. పరిహారం చెల్లింపు అంశంలో ఎప్పటికప్పుడు తగు పర్యవేక్షణ చేయాలని సబ్‌ కలెక్టర్‌, ఆర్డీఓలకు సూచించారు. అనంతరం వివిధ అంశాలలో సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు.సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఓ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి ఆర్డీఓలు రంగస్వామి, మురళి, ఎన్‌ హెచ్‌ అధికారులు, తహశీల్దార్లు, డీటీలు, వీఆర్వోలు పాల్గొన్నారు.
- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష