అది ఒకప్పుడు బాగా పండిన పొలమే. రాను రాను రాలుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ అవటంతో ఆ పొలంగల రైతు పొలాన్ని పంట వెయ్యకుండా వదిలేశాడు. పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు అక్కడక్కడ పెరగడంతో పశువుల కాపరులు పశువులను ఆ పొలానికి తోలేవారు. ఆ పొలంలో పెరిగే ఆకూ అలమూ గడ్డీ గాదనూ పశువులు మేతగా మేసేవి. కొన్నేళ్ల తరువాత అక్కడ పుట్టే ఆకూ అలమూ గడ్డీ గాదా నవనవలాడుతూ కనిపించడాన్ని రైతు గమనించాడు. పొలం నిండా పచ్చదనం చూసి నివ్వెరపడ్డాడు. పంటవేస్తే పండుతుందన్న ఆశ మళ్లీ కలిగింది. ఇంటికి వెళ్లి ఇల్లాలితో చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ వింత చూడడానికి బయలుదేరింది. పంట వెయ్యకుండా వదిలేసిన భూమిని చూసి 'భూమి కరుణించింది నేల మెత్తబడింది' అంటూ అక్కడ పచ్చగడ్డి మేస్తున్న పశువులను హేయ్.. హేయ్.. అంటూ పొలం బయటకు అదిలించసాగింది.
ఇంతలో పట్నం నుంచి అక్కగారింటికి ఆ దారిన వస్తున్న గోపీ వాళ్లక్కా బావలను చూసి ఆగిపోయాడు. పొలంలో ఉన్న వారి దగ్గరకు వచ్చి 'ఈ ఎండలో ఇక్కడకు వచ్చారేమిటి?' అని అడిగాడు. గోపీని పలకరించి, జరిగింది చెప్పింది అక్క. పశువులను తోలుతున్న అక్కను ఆపి 'అక్కా ఈ పశువుల వల్లే మీ పొలానికి మళ్లీ జీవం వచ్చింది. అవి మీకు దేవతలే' అన్నాడు. అక్కాబావలిద్దరూ గోపీ వంక విచిత్రంగా చూశారు.
గోపీ నవ్వుతూ ఆ పొలంలో మట్టి పెళ్లను పెరికి తీసి చూపించాడు. ఆ మట్టి పెళ్లనిండా వానపాములు, చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. 'అక్కా, ఈ పురుగులే కాకుండా ఈ చిన్నపెళ్లలో వేలాది సూక్ష్మజీవులు ఉంటాయి. వీటివల్లే పంట పండని ఈ పొలానికి పచ్చదనం వచ్చింది. పండే యోగం కలిగింది' అని గోపీ అన్నాడు. అక్కాబావలు నివ్వెరపడుతూ ఔనా అన్నారు. అప్పుడు గోపీ 'మీరప్పుడు పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించేవారు. ఆ ట్రాక్టర్ బరువుకు పొలంలోని ఎన్నో క్రిములు, కీటకాలు చచ్చిపోతుండేవి. అంతేకాకుండా రాలుబడి అధికమవుతుందని అత్యాశకు పోయి, ఇష్టానుసారం రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడేవారు. ఆ రసాయనాల ఘాటుకు వ్యవసాయదారులకు మిత్రులుగా ఉండే పురుగులు, సూక్ష్మజీవులు దారుణంగా హతమయ్యాయి. కొన్ని పురుగులు భూమి లోపలికి చాలాదూరం పోయి, ప్రాణాలు దక్కించుకుంటాయి. భూమి లోపలకు పోయిన ఆ పురుగులే ఇప్పుడు పశువుల మలమూత్రాల వాసన పసిగట్టి, వాటిలో ఉండే సూక్ష్మ క్రిములతో సహవాసం చేయడానికి పైపొరను చేరుకున్నాయి. మట్టిలోని క్రిములు వ్యవసాయ భూమిని గుల్ల చేస్తాయి. భూమి గుల్లవడం వల్ల మొక్కలకు గాలి, నీరు సులభంగా చేరతాయి. అంతేకాదు, ఆ క్రిముల విసర్జకాలు నేలకు బలాన్ని కలిగిస్తాయి. ఈ క్రియలన్నీ జరగడానికి ఈ పశువులే కారణం కదా!' అని వివరంగా చెప్పాడు.
అక్కకు ఇంకా చిన్న సందేహం మిగిలింది. 'తమ్ముడూ, భూమి లోపలకు వెళ్లిపోయే పురుగులకు, క్రిములకు నేలపైనున్న వాసన ఎలా తెలుస్తుంది?' అడిగింది అక్క! గోపీ నవ్వుతూ 'అక్కా, మేము పట్టణంలో రెండో అంతస్థులో ఉన్నామా?! మరి ఆ రెండో అంతస్థులో ఉన్న పంచదార డబ్బా వరకూ కింద ఉండే చీమలు రాలేదా ఏమి?! నువ్వే కదా అప్పుడు చీమలు పట్టిన పంచదారను చూసి విసుక్కున్నావు?' గుర్తుచేశాడు.
'ఔను తమ్ముడూ నిజమే! క్రిములకు, కీటకాలకు వాసన పసిగట్టే శక్తి ఎక్కువ!' అంది నవ్వుతూ. బావ గోపీతో 'ఈసారి వ్యవసాయంలో ట్రాక్టర్ వాడం. నాగలితోనే దున్నుతాం. రసాయన పురుగు మందులు, ఎరువులు కూడా వాడం. పశువుల ఎరువులనే ఉపయోగిస్తాం' అన్నాడు. బావ నిర్ణయానికి గోపీ సంబరపడ్డాడు. 'ప్రకృతి వ్యవసాయం రైతుకు మేలు, నేలకు మేలు!' అని అక్కడున్న ఎద్దు గంగడోలును నిమిరాడు.
బెలగాం భీమేశ్వరరావు
99895 37835