కడప ప్రతినిధి/బద్వేలు : బద్వేల్‌లోని భూబకాసురుల భరతం పడతామని, భూబాధితులకు తిరిగి వారి భూములు వారికి ఇప్పిస్తామని టిడిపి జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం బద్వేల్‌లో కార్యకర్తల విస్తృత స్థాయీ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ మాజీమంత్రి కీ.శే బిజీవేముల వీరారెడ్డి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పంచాయతీ సమితి బోర్డు సభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించి తిరుగులేని నేతగా ఎదిగారని కొనియాడారు. ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రాష్ట్రానికి వాటిల్లుతున్న నష్టాన్ని ఓటర్లకు వివరించాలన్నారు. టిడిపి హయాంలో చేపట్టిన రంజాన్ తోఫా, అన్న క్యాంటిన్, విదేశీవిద్య వంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఒక అసమర్థుడు పాలన సాగిస్తే ఏమి జరుగు తుందో అనుభవంలోకి వస్తోందన్నారు. రిలయన్స్ సోదరుల్లో ఒకరు ఆసియాలో నెంబర్ వన్‌గా నిలిస్తే మరొకరు నామమాత్రంగా మిగిలి పోయారని గుర్తుచేశారు. టెక్నాలజీలో రెవెల్యూషన్ తీసుకొచ్చిన ఘనత టిడిపిదేనన్నారు. ఎన్‌హెచ్ పాలసీ ద్వారా తమిళనాడు నుంచి నెల్లూరు వరకు జాతీయ రహదారిని నిర్మించామన్నారు. త్వరలో బద్వేల్‌కు ఔటర్ రింగురోడ్డు వస్తుందని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడుతూ బద్వేల్‌లో టిడిపి అభ్యర్థిని గెలిపించి అధ్యక్షులు చంద్ర బాబుకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్తా సైనికుడై పని చేయాలని తెలిపారు. యువ నాయకుడు రితేష్‌రెడ్డి మాట్లాడుతూ తమ తాత బిజీవేముల వీరారెడ్డి ఆశయాలకు వారసునిగా వచ్చానని తెలిపారు. తనకు కార్యకర్తలే బలమూ, బలహీనతా అని చెప్పారు. సోమశిల వెనుకజలాలు, కుందూ నుంచి ఐదు టిఎంసిల నీళ్లు ఇస్తామన్న పాదయాత్ర హామీ ఏమైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పరోక్షంగా ప్రశ్నించారు. బద్వేల్ భూదందాపై కమిషన్ వేయాలన్నారు. అనంతరం టిడిపి నాయకులు ఓబుళాపురం రాజశేఖర్ మాట్లాడుతూ 2019లో బద్వేల్‌కు టిఎంసి నీటి తరలింపునకు ఇచ్చిన జివో బుట్టదాఖలు కావడం ఆందోళనకరమని తెలిపారు. ఫలితంగా మూడు మండలాలకు నీటి చుక్క కరువై అలమటిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, పొలిట్‌బ్యూరోసభ్యులు ఆర్.శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, అమీర్‌బాబు, టిడిపి నాయకులు రితేష్‌రెడ్డి, బొగ్గుల గుర్రప్ప, ఓబులాపురం రాజశేఖర్, గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, పెద్దఎత్తున కార్య కర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబుకు ఘన స్వాగతం
పోరుమామిళ్ల :మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బద్వేల్ పర్యటన ముగించుకుని గిద్దలూరుకు వెళుతూ పోరుమామిళ్ల పట్టణంలోని గాంధీ బొమ్మ సర్కిల్‌లో ఆగి మేజర్ పంచాయతీ సర్పంచి యనమల సుధాకర్‌తో కలిసి గాంధీ బొమ్మకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడును సుధాకర్ దంపతులు శాలువతో సన్మానించారు.
చంద్రబాబుకు శ్వేతారెడ్డి సన్మానం
కాశినాయన : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండల పరిధిలోని ఓబులాపురం క్రాస్ వద్ద తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షులు కర్నాటి శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో భారీ జన సమూహంతో స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో నర్సాపురం మాజీ సర్పంచ్ కె.వి.సుబ్బారెడ్డి నరసాపురం ప్రజలు బాలరాజుపల్లె, సావిశెట్టిపల్లె, బాలయ్యపల్లె, ఉప్పలూరు, మిద్దెల వద్ద స్వాగతం పలికారు.
- వీరారెడ్డి చిత్రపటానికి నివాళుర్పిస్తున్న చంద్రబాబు










