Mar 20,2023 21:34

ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు మల్లి

భూ సమస్యపై ఆర్‌డిఒకు వినతి
ప్రజాశక్తి-కావలి : బోగోలు మండలం పాత బిట్రగుంట అరుంధతీయవాడ గ్రామానికి చెందిన పలువురు దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు మల్లి, తదితరులు కలిసి గ్రామనత్త భూమి గురించి ఆర్‌డిఒకి సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అనుభవంలో ఉన్న గ్రామనత్తం భూమిని దౌర్జన్యంగా గ్రామస్తులైన వాకా బాలిరెడ్డి ఆక్రమించుకుంటు న్నారని తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒకు విన్నవించారు. తాము దాదాపుగా 70 సంవత్సరాల నుండి గ్రామ అవసరాలకి వాడుకుంటున్నామని అందులో గడ్డివాములు పశువుల కొట్టాలు ఇతర వాటికి వినియోగించుకుంటున్నామని తెలియజేశారు. అయితే తమను అడిగి కొంతకాలం వాకా బాలిరెడ్డి కొంత భాగంలో గడ్డివాములు వేసుకుంటున్నారని తెలియజేశారు. ప్రస్తుతం భూమి అంతా తనదే అని అంటున్నారని వాపోయారు.
వారి ఊరు చాలా దూరం అని, కాలనీలోని స్థలాన్ని ఆక్రమించుకొని గడ్డివాములు వేసుకుంటున్నారని తెలియజేశారు. తాము ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఈ మేరకు కలెక్టర్‌ దృష్టికి తహశీల్దార్‌ దృష్టికి తీసుకొని వెళ్లామని తెలిపారు. గ్రామనత్తం భూమి కాబట్టి ఎవరికీ హక్కు లేదని పేర్కొన్నారు. అరుంధతీయవాడ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్న భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం అన్యాయమన్నారు. కాబట్టి విచారించి తమ అనుభవంలో ఉన్న ఈ భూమిపై హక్కులు కల్పించాలన్నారు. తిరునాళ్లు ఇతరశుభకార్యాలకు ఉపయోగించే భూమిని ధనవంతులు గడ్డివాములకు ఉపయోగించుకోవడం అన్యాయమని తెలియజేశారు. కార్యక్రమంలో బి.శ్రీనివాసులు, రాంబాబు, సాయి, కొండమ్మ, వెంకమ్మ, తదితరులు పాల్గొన్నారు.