Jan 06,2023 19:48

సదస్సులో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

30న కలెక్టరేట్‌ ముట్టడి
భూ సదస్సులో వ్య.కా.స రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : భూ కబ్జాలు అరికడతారా లేక ఎర్రజెండా పాతి పేదలకు పంచమంటారా అంటూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఎన్‌జిఒ హోంలో ఎఐఎడబ్లుయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూ కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే అధికారులు లొంగిపోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదలు ఇంటి కోసం జానెడు స్థలం ఆక్రమిస్తే మంద బలంతో వాలిపోయి నానా యాగిచేసే అధికారులు వందల ఎకరాలు ఆక్రమణలకు గురవుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. పేదల చేతుల్లో భూమి ఉంటేనే గౌరవం ఉంటుందని, ఉపాధి దొరుకుతున్న పరిస్థితుల్లో వారికి ఉన్న అరకొర భూములు కూడా కబ్జాకు గురవడం దుర్మార్గమని పేర్కొన్నారు. దొంగ పత్రాలను సృష్టించి భూములను అప్పనంగా కాజేసే వారికి అధికార పార్టీ నేతలు అండదండలు ఉన్నాయని విమర్శించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులు తారుమారు చేస్తున్నారని, భూముల నుండి పేదలను, దళితులను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్‌మెంట్‌ చట్టాన్ని మార్చివేసి పేదల భూములను పెద్దలకు కట్టబెట్టాలని జగన్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుకే ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో అసైన్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. భూములను పేదలకు పంచాలని లేని పక్షంలో ఎర్రజెండాలు పాతి ప్రభుత్వ భూములను పేదలకు పెంచుతామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పటి నుండి భూ కబ్జాలు ఎక్కువుగా జరుగుతున్నాయని తెలిపారు. భూ కబ్జాదారులుకు అధికారులు కూడా వత్తాను పలుకుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములు, 1బిలో పేర్లు మారిపోవడం, ప్రభుత్వ భూములు సైతం రిజిస్టేషన్లు చేస్తున్నారన్నారు. వీటిని అరికట్టేందుకు సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని ప్రతి మండలంలో దొంగ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూములను కాజేయడం, దళితుల భూములను ఆక్రమించడం, దాడులు చేయడం ఎక్కువుగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయచోటి మండలంలో అక్రమ రిజిస్ట్రేషన్లపై కేసులు నమోదు చేసినా, కబ్జాదారులు, నిందితులకు ఉన్న పలుకుబడితో కేసు నీరు గార్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. ఇప్పటికే జిల్లాలో అనేక ప్రాంతాల్లో నమోదైన కేసుల పురోగతి లేదు కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జిల్లాలో జరుగుతున్న భూ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వ భూములకు, దళితుల భూములకు రక్షణ కల్పించాలని కోరారు. అన్నమయ్య జిల్లా నాయకులు పందికాళ్ల మణి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, కెవిపిఎస్‌ జిల్లా కో-కన్వీనర్‌ డి.సి.వెంకటయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్‌.రామచంద్ర తదితరులు ప్రసంగించారు. పేదల, ప్రభుత్వ భూములు కాపాడాలని, దళితుల భూములకు రక్షణ కల్పించాలని, భూ కబ్జాలపై జిల్లా జడ్జి పర్యవేక్షణలో జాయింట్‌ కలెక్టర్‌, ఎస్‌పి పర్యవేక్షణ లో విచారణ చేపట్టాలని, అధికారులు స్పందించక పోతే జనవరి 30న కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి చేపట్టాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా కార్యదర్శి అన్వేష్‌, అన్నమయ్య జిల్లా నాయకులు వేమనారాయణ, శివయ్య, జయరామయ్య, నాగబసిరెడ్డి, సుజాత, రమణమ్మ, ఓబులేసు, చిన్నప్ప పాల్గొన్నారు.