Dec 30,2022 19:42

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు
ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న భూ ఆక్రమణలను నిగ్గు తేల్చాలని, అందుకోసం జిల్లా జడ్జి పర్యవేక్షణలో జాయింట్‌ కలెక్టర్‌, ఎస్‌పి సంయుక్తంగా విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుండి భూ కబ్జాలు ఎక్కువుగా జరుగుతున్నాయని తెలిపారు. భూ కబ్జాదారులుకు అధికారులు కూడా వత్తాను పలుకుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములు, 1బిలో పేర్లు మారిపోవడం, ప్రభుత్వ భూములు సైతం రిజిస్టేషన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం భూ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, అనంతరం కలెక్టర్‌ గిరీషకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాసాపేట రెవెన్యూ గ్రామం 971/1లో 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్‌ చేశారని తెలిపారు. చెన్నముక్కపల్లి గ్రామం సర్వే నంబరు 102లో 60 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని స్థానికేతరులైన ప్రైవేటు వ్యక్తుల పేర్లు 1బిలో చేర్చారని, మాసాపేట రెవెన్యూ గ్రామం 1201 సర్వే నెంబరులో 5 ఎకరాల లక్కెం రెడ్డెయ్య, లక్కెం వెంకటరమణల పేర్లతో ఉన్న భూములను 1బిలో పేరు మార్పులు చేసి అన్యాక్రాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాపురం మండలం చిట్లూరు మాదిగపల్లి శ్మశాన భూమి స్థానికేతరుడైన వారికి 1బిలో చేర్చారని, సంబేపల్లి మండలం దుద్యాల గ్రామ 1179, 1138, 2805, 2897, 2917, 2919 మొదలైన సర్వే నెంబర్లలలో మూడు తరాలుగా అనుభవంలో ఉన్న దళితుల భూములకు పట్టాలివ్వకపోగా కబ్జాలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మదనపల్లి మండలంలోని వలసపల్లి రెవెన్యూ గ్రామం 711/1లో పేదల కిచ్చిన పట్టా రద్దు చేసి 4.13 నెంట్లను ఇతరులకు కట్టబట్టేందుకు రంగం సిద్ధమైందన్నారు. మదనపల్లి పట్టణం కమ్మపల్లి రెవెన్యూ గ్రామం 236/5లోని రూ.8 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గ్రామకంఠం భూమిగా మార్చి అమ్మేస్తున్నారని వివరించారు. సంబేపల్లి మండలం రౌతుకుంట గ్రామం 382/ఎలో ఉన్న 36 సెంట్ల ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భూములని బోర్డులు పెట్టినా లెక్కచేయకుండా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి మండలంలో దొంగ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూములను కాజేయడం, దళితుల భూములను ఆక్రమించడం, దాడులు చేయడం ఎక్కువుగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయచోటి మండలంలో అక్రమ రిజిస్ట్రేషన్లపై కేసులు నమోదు చేసినా, కబ్జాదారులు, నిందితులకు ఉన్న పలుకుబడితో కేసు నీరు గార్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. ఇప్పటికే జిల్లాలో అనేక ప్రాంతాల్లో నమోదైన కేసుల పురోగతి లేదు కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జిల్లాలో జరుగుతున్న భూ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వ భూములకు, దళితుల భూములకు రక్షణ కల్పించాలని కోరారు. భూ కబ్జాలపైన సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. జనవరి 6న జిల్లాలో ఉన్న భూ బాధితులను సమీకరించి జిల్లా సదస్సు జరుగుతున్నామని, ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారని వివరించారు. వెంటనే విచారణ కమిటీ వేసి, భూ బాధితులకు న్యాయం చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, కె.నాగబసిరెడ్డి డి.సి.వెంకటయ్య, ఎస్‌.రామచంద్ర, ఓబులేసు, చిన్నప్ప పాల్గొన్నారు.