Dec 28,2022 19:30

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌
ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌హొ: అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న భూ ఆక్రమణలను నిగ్గు తేల్చాలని, అందుకోసం జిల్లా జడ్జి పర్యవేక్షణలో జాయింట్‌ కలెక్టర్‌, ఎస్‌పి సంయుక్తంగా విచారణ చేపట్టాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని కల్యాణ మండపంలో సిపిఎం ఆధ్వర్యంలో ''పభుత్వ భూములను కాపాడుకుందాం..జిల్లాను సమగ్రంగా అభివద్ధి చేసుకుందాం' అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పటి నుంచి రాయచోటి కేంద్రంగా భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులను తారుమారు చేస్తూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాసాపేట గ్రామ సర్వే నెంబర్‌ 971లో మొత్తం 84 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 70 ఎకరాలు కలెక్టర్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించగా మిగిలిన ప్రభుత్వ భూములను అధికారులు ప్రమేయం లేకుండానే కాజేశారా అని ప్రశ్నించారు. రామాపురం మండలం చిట్లూరు దళితవాడ శ్మశాన భూమి, చెన్నముక్కపల్లిలో దళితుల ఈనాం భూమి, సంబేపల్లి మండలంలో దుద్యాల దళితుల అనుభవంలో ఉన్న భూములు అధికార పార్టీ నాయకులు, అధికారులను అడ్డం పెట్టుకొని కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. దుమారం రేగిన తర్వాత కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటే సరిపోదని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాయచోటి కేంద్రంగా జరిగిన భూ కబ్జాలపై రాయచోటి శాసనసభ్యులు స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో, తహశీల్దార్‌ కుర్చీలోనే కూర్చొని మాట్లాడిన తీరు చూస్తేనే శాసనసభ్యులు ఆయన్ను ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారని అర్థం అవుతుంది అన్నారు. భూ కబ్జాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన చెబితే సరిపోదని, భూ కబ్జాలకు పాల్పడిన వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. భూ కబ్జాలకు సంబంధం లేకపోతే జిల్లా జడ్జి పర్యవేక్షణ లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సంయుక్తంగా విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో భూ బాధితులను సమీకరించి ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పౌర హక్కుల సంఘం నాయకులు టి.ఈశ్వరయ్య, భారత నాస్తిక సమాజం నాయకులు పి.తాతయ్య, మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎస్‌.సగీర్‌, బిఎస్పి జిల్లా నాయకులు యుగంధర్‌, విద్యావంతుల వేదిక నాయకులు చల్లా రెడ్డెయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు ఎస్‌.రామచంద్ర, ఆంద్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా నాయకులు కే. నాగబసిరెడ్డి, నాయకులు ఆఫ్తాద్‌ తదితరులు ప్రసంగించారు. అనంతరం అన్నమయ్య జిల్లా భూ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి కన్వీనర్‌గా అన్నమయ్య జిల్లా సిపిఎం కార్యదర్శి పి.శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలో భూ కబ్జాలపై జిల్లా జడ్జి పర్యవేక్షణలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సంయుక్తంగా విచారణ చేపట్టాలని, కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.