Dec 24,2022 19:31

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

ప్రజాశక్తి-పీలేరు: జిల్లాలో భూ కబ్జాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. శనివారం స్థానిక సిపిఎం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు అధికమయ్యాయని చెప్పారు. అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత మరింత ఎక్కువగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిపారు. శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని విమర్శించారు. పేదలు, దళితులకు ప్రభుత్వం మంజూరు చేసిన భూములు, ఇండ్ల స్థలాలు సైతం కబ్జా చేస్తూ, రౌడీల్లా దాడులకు పాల్‌ పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలవవాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు సైతం కబ్జా దారులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. తాము జిల్లా వ్యాప్తంగా బాధిత కుటుంబాలను సమీకరించి, వారికి అండగా నిలిచి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమేష్‌ బాబు, హరిశర్మ, శంకర పాల్గొన్నారు.