భోగి మంటల్లో జిఒ నెంబర్ ఒకటి
ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్రంలో అధికార వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ర్యాలీలు, ఊరేగింపులు, సభలను నిర్వహించరాదని తీసుకొచ్చిన జిఒ నెంబర్ 1 ప్రతులను జిల్లా సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు మూలి వెంగయ్య శనివారం తిక్కవరంలో భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ కాలంనాటి చీకటి జిఒలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జారీ చేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. జిఒ నెంబర్ 1పై హైకోర్టు స్టే విధించినా అది తాత్కాలికమే అని వెంటనే ప్రభుత్వం ఈ జిఒను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో పలు గ్రామాల్లో సిపిఎం సానుభూతిపరులు ఈ ప్రతులను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. కార్యక్రమంలో తిక్కవరం సిపిఎం నాయకులు గంగినేని తిరుపతి, సానుభూతిపరులు పాల్గొన్నారు.










