Apr 27,2023 21:35

భగీరథుని చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌

రాయచోటి : భగీరథ మహర్షి పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ గిరీష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని పురష్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ గిరీష, డిఆర్‌ఒ సత్యనారాయణలు పూలమాలనేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వ జీవకోటికి ప్రాణాధారమైన పవిత్ర గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన మహనీయులు అపర భగీరథుడు అన్నారు. భగీరథ మహర్షి పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివి నుండి భువికి గంగను లోక కల్యాణం కోసం తెచ్చిన మహానుభావుడన్నారు. ఆయన పట్టుదలకు మారు పేరని, అందుకే ఆయన అపర భగీరథుడుగా పేరొందారన్నారు. పరోపకారానికి, దీక్షకు, సహనానికి ప్రతిరూపమైన భగీరధుని ఆదర్శంగా తీసుకొని సమాజం కొరకు సేవ చేయాలన్నారు. కఠోర పరిశ్రమ చేసి దేనినైనా సాధించగలమని భగీరథ నిరూపించారని వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత లక్ష్యాలను సాధించి విజయాలు అందుకోవాలని తెలిపారు.భగీరథ మహర్షి జయంతిని పురష్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సందప్ప, కలెక్టరేట్‌ ఏఓ బాలకృష్ణ, వార్డెన్‌ల స్టేట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఆర్‌.మనోహర్‌ రెడ్డి, కలెక్టరేట్‌ అధికారులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.