May 03,2022 11:20

నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
న్యూఢిల్లీ : మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. కానీ భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసేందుకు మోడీ సర్కార్‌ కంకణం కట్టుకుంది. దేశంలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం.. ఎదురు దాడికి దిగుతోంది. దేశంలో వాస్తవాలను కళ్లకు కట్టినట్లు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న వార్తాసంస్థలపై కత్తి గట్టింది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయన్న న్యూస్‌క్లిక్‌, న్యూస్‌ లాండ్రి, ది వైర్‌ వంటి సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడి చేయించింది. వార్తా సంస్థలనే కాదూ... జర్నలిస్టులనూ వదల్లేదు. అలాంటి వారే సిద్ధిఖీ కప్పన్‌, ఫహద్‌ షా మొదలైన వారు. వారేదో దేశ ద్రోహులన్నట్లు.. కక్ష గట్టిన బిజెపి సర్కార్‌.. కఠిన చట్టాలతో ఖైదు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. దళిత మహిళపై సామూహిక హత్యాచారం జరగ్గా.. ఈ ఘటనలో మరో కోణాన్ని ప్రజలకు తెలియజేసేందుకు యుపికి వెళ్లిన సిద్ధిక్‌ కప్పన్‌ అనే కేరళ జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేసి... నేటికి 575 రోజులు గడుస్తుంది. శ్రీనగర్‌లో అరెస్టు చేసిన కాశ్మీర్‌ వాలా ఎడిటర్‌ ఫహద్‌ షాను శ్రీనగర్‌లో అరెస్ట్‌ చేసి మంగళవారానికి మూడు నెలలు కాగా, ప్రీలాన్స్‌రిపోర్టర్‌ సలాద్‌ గుల్‌కి జమ్ముకాశ్మీర్‌ అధికారులు జైలులో ఉంచి.. నేటికి నాలుగు నెలలు పూర్తి కానుండటం గమనార్హం. కప్పన్‌, ఫహద్‌లపై అత్యంత కఠినమైన చట్ట విరుద్ధ కార్యాకలాపాల (నివారణ) చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. కప్పన్‌ ఇప్పటికీ బెయిల్‌ పొందలేకపోతే... ఫహద్‌ బెయిల్‌ పొందిన వెంటనే రెండవ కేసులో వెంటనే అరెస్టు చేయడం గమనార్హం. ఆయన్ను జీవితాంతం జైల్లో ఉంచేలా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు హామీనిచ్చిన.. జమ్ముకాశ్మీర్‌లోని కేంద్రపాలిత ప్రాంతంలోని యంత్రాంగం.. ప్రజా భద్రత చట్టం కింద అభియోగాలు మోపింది. దీంతో ఎటువంటి విచారణ లేకుండా ఆయన్ను సంవత్సరం పాటు జైలులో ఉంచే అవకాశం ఉంది. ఇక సజాద్‌ విషయంలోనూ ఈ పంథానే అనుసరించింది ఆ ప్రభుత్వం. వీరినే ఎక్కువగా ప్రస్తావిచండం వెనుక కారణమేమిటంటే.. గతంలో పత్రికా స్వేచ్ఛపై దాడి చేయాలనుకుంటే.. ఎక్కువగా పరువు నష్టాల కేసులు దాఖలయ్యాయి. కానీ నేడు ఆ పరిధి చాలా తీవ్రంగా ఉంది. కానీ, ఇప్పుడు వీరిని దేశద్రోహులుగా పేర్కొంటూ.. జైళ్లకే పరిమితం చేసే కార్యక్రమాన్ని మోడీ సర్కార్‌ తీసుకుంది.

పత్రికా స్వేచ్ఛమై తీవ్రమైన దాడి ఎలా చేస్తుందంటే..?
- జర్నలిస్టుల అరెస్టు, జైలు శిక్ష
- అనేక మంది రిపోర్లపై (ద వైర్‌తో పాటు జర్నలిస్టులపై సహా) క్రిమినల్‌ కేసుల నమోదు
- జర్నలిస్టులపై పెగాసస్‌ వంటి స్పైవేర్‌ వినియోగించిన నిఘా పెట్టడం
- ఫీల్డ్‌లోని రిపోర్టులపై భౌతిక దాడులు జరపడం
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కంటెంట్‌ను తొలగించడానికి బెదిరింపులు
- బహిర్గతం చేయని, కల్పితం, జాతీయ భద్రతా కారణాలతో టెలివిజన్‌ సంస్థలపై నిషేధం
- ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని చెప్పి వార్తా సంస్థలను, జర్నలిస్టులను వేధించడానికి అధికారిక ఏజెన్సీలను దుర్వినియోగపర్చడం
- ఇంటర్నెట్‌ నిలిపివేయడం
- ప్రభుత్వ ప్రకటన కేటాయింపుల్లో కోత, ప్రతీకార ధోరణీ, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ వినియోగించిన వ్యూహం
- డిజిటల్‌ మీడియాలో అధికారిక అక్రిడేషన్‌, విదేశీ పెట్టుబడుల కోసం ఆమోద ప్రక్రియలో ఏకపక్షం
- అంతర్జాతీయ మీడియా ద్వారా వాస్తవాలు వెల్లడించే వీలు లేకుండా.. కాశ్మీర్‌ సందర్శనలపై నిషేధం... జర్నలిస్టు వీసాల కోసం నిబంధనలను కఠినతరం చేయడం
- పదవీ విరమణ అనంతరం అధ్యక్షుడిని నియమించకుండా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను పనికిరానిదిగా మార్చడం. పిసిఐని అధికారికంగా రద్దు చేయాలనే ఇందిరాగాంధీ నిర్ణయానికి పక్కా ప్రణాళిక అమలు చేయడం
- టెక్‌ఫాగ్‌ యాప్‌పై ది వైర్‌ పరిశోధనలో పేర్కొన్నట్లుగా.. నకిలీ వార్తలను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేయడం, జర్నలిస్టులు.. ముఖ్యంగా మహిళలను అధికార పార్టీ నేతలతో వేధింపులు, ట్రోలింగ్‌ చేయడం.
- సమాచార సాంకేతిక రూల్స్‌ 2021 ద్వారా డిజిటల్‌ న్యూస్‌ కంటెంట్‌పై సెన్సార్‌కి కొత్త చట్టాలను తీసుకురావడం.

       ఇవన్నీ మోడీ సర్కార్‌ అవలంభిస్తున్న ప్రస్తుత దాడి నిర్వాకాలు. కేంద్రానికి పాదర్శకత, జవాబుదారీ తనం లేకపోవడం కూడా పత్రికా స్వేచ్ఛపై దాడికి కారణాలు. దాడులు జరుగుతున్నాయని తెలిసినా కూడా మౌనం వహించడం ప్రధానికే చెల్లుతుంది. ఎందుకంటే.. ప్రధాని మోడీకి రెండు సార్లు ప్రధాని అయ్యాక కూడా.. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మీడియా ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం. ఒక వేళ విదేశాలకు వెళ్లినప్పుడు.. ప్రశ్నలు అనుమతించడానికి నిరాకరిస్తారు. అటువంటి కార్యక్రమాలకు మాత్రమే ఆయన హాజరు అవుతారు. ఇక సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ఏదో కుంటి సాకులు చెప్పి.. వాటిని తిరస్కరిస్తారు. ఇక పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాల్సిన కోర్టులు సైతం.. ఈ దాడులపై ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నాయి.