Jan 25,2023 19:37

- గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌

రాయచోటి టౌన్‌ : భారతజాతి గుండె చప్పుడు మహాత్మ గాంధీ అని కలెక్టర్‌ గిరీష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్‌, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గాంధీజీ దేశభక్తి, చిత్తశుద్ధి, నిజాయితీ, సేవా భావాలు అందరికీ ఆదర్శం కావాలన్నారు. సమస్త మానవాళి అహింస, శాంతి, సౌభ్రాతత్వంతో సుఖంగా జీవించాలనే మహాత్ముని సిద్ధాంతం, ప్రవచనం ఏనాటికైనా సరే విశ్వజనీనం, సార్వజనీనం, శాశ్వతం. దాన్నెవరూ తుడిచేయలేరన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సత్యం, అహింసలు గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలని, కొళాయికట్టి, చేత కర్ర పట్టి, నూలు ఒడికి, మురికి వాడలు శుభ్రం చేసి, అన్నీ మతాలు ఒక్కటేనని చాటి చెప్పి రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్య పాలనకు చమరగీతం పాడారన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాధ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ భారతీయుల హృదయాలలో నిలిచిన అమరజీవి అని అన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌డిఒ రంగస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, తహశీల్దార్‌ రవిశంకర్‌ రెడ్డి, ఎపిఎస్‌పిడిసిఎల్‌ ఎస్‌ఇ చంద్రశేఖర్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహమాన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, కర్ణపు విశ్వనాధరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.