వాషింగ్టన్ : భారత్ సిగ్నల్ ఇవ్వగానే...వీలైనంత త్వరగా టీకాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నైడ్ ప్రైస్ అన్నారు. అయితే భారత్ ఇంకా పచ్చ జెంగా ఊపాల్సి ఉందని పేర్కొన్నారు. టీకాలు స్వీకరించే విషయంలో చట్టపరమైన అంశాలను భారత్ సమీక్షిస్తోందని తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్లు తీసుకునేందుకు మరింత సమయం పట్టవచ్చునని భారత్ పేర్కొందని చెప్పారు. భారత్‌లో ఫార్మా రంగం చాలా బలంగా ఉందన్న ఆయన..వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో భారత్‌కు ఉన్న సామర్థ్యం ప్రపంచ దేశాలకు లబ్ది చేకూరుస్తోందని అన్నారు.
ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వైద్యారోగ్యం, బయోటెక్ రంగాల్లో కొన్నేళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటిని మరింత పటిష్ట పరిచేలా త్వరలో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి రానున్నాయని చెప్పారు. ఈ మధ్య జరిగిన క్వాడ్ సదస్సులో..వ్యాక్సిన్ల ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేలా భారత్‌కు ఆర్థిక సహకారం అందించేందుకు సభ్యదేశాలు అంగీకరించిన విషయాన్ని మననం చేసుకున్నారు.
కాగా, అమెరికా భారీగా వ్యాక్సిన్లను నిల్వ చేసింది. వీటిలో 80 మిలియన్ డోసుల్ని వ్యాక్సిన్ల లోటుతో సతమతమౌతున్న వివిధ దేశాలకు అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ గతంలోనే అంగీకారం తెలిపారు. ఇప్పటికే పాక్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాలకు 40 మిలియన్ డోసులు చేరుకున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం టీకా విరాళాలను స్వీకరించే విషయంలో ఉన్న అవరోధాల్ని ఇంకా పరిష్కరించాల్సి ఉంది. అందువల్లే అమెరికా టీకాలు అందించడంలో ఆలస్యమవుతోంది.










