భారత ఆర్థిక, సామాజిక వృద్ధిలో సిపిఎం కీలకపాత్ర : సౌహార్ద సందేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : భారత ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో సిపిఎం కీలక పాత్ర పోషించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆకాంక్షించింది. సిపిఎం 23వ మహాసభ సందర్భంగా పంపిన సౌహార్ద సందేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఈ మేరకు ఆకాంక్షను వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి సిపిఎం ఇప్పటికే ఎంతో కృషి చేస్తోందని పేర్కొంది. వందేళ్ల సుదీర్ఘ చరిత్రతో భారత రాజకీయాల్లో సిపిఎం చెరగని ముద్ర వేసిందని, సోషలిజం పట్ల తిరుగులేని విశ్వాసంతో కట్టుబడి ఉందని పేర్కొంది. నిర్ధుష్ట పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకునే క్రమంలో జరుగుతున్న మహాసభ నూరు శాతం విజయవంతం కావాలని పేర్కొంది. చైనా, భారత ప్రజల నిజమైన అభివృద్ధికి ఉపయోగపడేలా రెండు పార్టీల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడాలని పేర్కొంది.
- భావితరాలకు స్ఫూర్తి : క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ
ప్రజలకు, పార్టీకి మధ్య అవినాభావ సంబంధాలను నెలకొల్పడంతో సిపిఎం చూపుతున్న శ్రద్ధ భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుందని క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ''సిపిఎం నాయకులు చూపిన ఈ తరహా చొరవ కారణంగానే క్యూభా, భారత ప్రజల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. కష్టకాలంలో క్యూబన్ ప్రజలకు సిపిఎం అండగా నిలిచిన తీరును ఎప్పటికి మరవలేం. ట్రంప్ ప్రభుత్వం క్యూబా ప్రజలపై అమలు చేసిన ఆంక్షలను బైడెన్ సర్కారు కూడా అమలుచేస్తోంది. అయినా క్యూబా ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వాస్తవాల నేపథ్యంలో సామ్రాజ్యవాదంపై పోరును కొనసాగించడానికి, ప్రజల, కార్మికుల, రైతుల హక్కుల పరిరక్షణ కోసం మరింత ఉధృతంగా పోరాటాలు చేయాల్సిఉంది. అటువంటి పోరాటాలే అసమానతలు, వివక్ష, అన్యాయం లేని మెరుగైన ప్రపంచాన్ని సృష్టిస్తాయి.'' అని పేర్కొంది. ఈ దిశలో రెండు పార్టీల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని తెలిపింది.
- ప్రజానుకూల విధానాలే కేరళలో విజయానికి కారణం : వియత్నాం కమ్యూనిస్టు పార్టీ
సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజానుకూల అభివృద్ధి విధానాలే కేరళలో వరుసగా రెండవ సారి చారిత్రాత్మక విజయానికి కారణమని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఈ విజయం పునాదిగా దేశ వ్యాప్తంగా మరిన్ని విజయాలను సాధించేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని 23వ మహాసభ చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ''గతంలో కమ్యూనిజానికి కష్టకాలం వచ్చిన సమయంలోనూ సిపిఎం మార్క్సిజానికి, లెనినిజానికి అంకితమై నిలిచింది. ఇదే ఆ పార్టీకి ప్రత్యేకతను తెచ్చింది. భవిష్యత్తులోనూ ఇదే కృషిని కొనసాగించాలి. రానున్న రోజుల్లో వియత్నాం, భారత ప్రజల మధ్య సౌహార్ద సంబంధాలు మరింత మెరుగుపడాలి.'' అని ఆకాంక్షించింది. మహాసభ విజయవంతం కావాలని వియత్నాం వర్కర్స్ పార్టీ తన సందేశంలో పేర్కొంది.










