ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గిపోయాయి. కిలో ధర రూ.5కు పడిపోయింది. దీంతో సాగు చేసిన రైతన్నలకు మాత్రం నష్టాలే మిగిలాయి. మండల వ్యాప్తంగా ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేశారు. ప్రతి కూల వాతావరణం, ధరలు లేకపోవడంతో టమోటా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో వ్యయం చేసి సాగు చేసిన పంటకు దిగుబడి బావున్నా ధరలు పడిపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాశక్తి - రామసముద్రం
మల్చింగ్ పద్దతిలో పండించే ప్రతి పంట అధిక దిగుబడులు వస్తాయని, కలుపు, కూలీల ఖర్చులు తగ్గుతాయని, పంటకు చీడ పీడల నుంచి రక్షణ కవచాలు ఏర్పాటు చేయడం వల్ల కలుపు నియంత్రణలో ఉంటుందని, రైతుకు అదనపు ఆదాయం చేకూరుతుందని ఆశతో ప్రతి టమాటో రైతు మల్చింగ్ కవర్లు వినియోగించి పంటలు సాగు చేశారు. ఒక్కో ఎకరానికి దాదాపు రూ.1.20 లక్షల వ్యయం పెట్టుబడి వ్యయం అవుతున్నట్లు రైతులు అంటున్నారు. దుక్కి దున్నకాలు, మల్చింగ్ సాలు పోయడానికి, నార కొనుగోళ్లు, ఎరువులు, మల్చింగ్ పేపర్లు, డ్రిప్‌పైపులు, పివిసి పైపులు, పిచికారీ మందులు, మొక్కలు పడిపోకుండా నాటే కట్టెలు, నైలాన్ పుర్రెలు, కూలీలు ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రస్తుతం ధరలతో కనీసం పెట్టుబడులు కూడా మిగలని పరిస్థితి నెలకొంది. మండల వ్యాప్తంగా గత సంవత్సరం కురిసిన వర్షాలతో దాదాపు 16 పంచాయతీలలో బోర్లలో ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉన్నాయి. బోర్లలో కూడా నీరు ్లవస్తుండటంతో రైతులు ఆనందంగా ఉన్నా, మరో వైపు అంచనాలకు మించి విస్తీర్ణం సాగు చేశారు. ప్రస్తుతం 25 శాతం పంటలు మార్కెట్ యార్డుకు వెళ్తున్న క్రమంలో ధరలు పడిపోవడం ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల కిందట వరకు కిలో టమోటా ధర రూ.5 నుంచి రూ.7 వరకు ఉండగా, ఉగాది తర్వాత ధర తగ్గింది. టమోటా సాగు విస్తీర్ణం పెరగడం, ఒక ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుండటం తదితర కారణాలతో మార్కెట్లలో ధర తగ్గిందని ఉద్యనవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధర తగ్గడంతో వినియోగదారులకు ఊరట లభించక, సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
టమోటా సాగు విస్తీర్ణం పెరగడం కూడా ధర తగ్గడానికి కారణమైంది. గతంలో రామసముద్రం మండలంలో సాగు విస్తీర్ణం ఆరు వేల ఎకరాల కంటే తక్కువగా ఉండేది. ప్రస్తుతం రెండు వేల ఎకరాలకు పైగా టమాటా సాగవుతోంది. వడగాలులు, గాలిలో తేమశాతం తగ్గడంతో పంటకు ప్రతికూలమైన వాతావరణం ఉండటంతో పూత రాలే అవకాశం ఎక్కువగా ఉండటంతో దిగుబడి తగ్గిందని ఉద్యనవన శాఖ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం పంటలో నష్టపోయిన రైతులు ఈ సీజన్‌లో సాగుకు రైతులు ఆసక్తి చూపించారు. ప్రతికూల వాతావరణం, ధరలు లేకపోవడంతో పూర్తిగా నష్టపోయారు. కూరగాయల సాగు విస్తీర్ణంలో నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఎకరాల్లో సాగు అవుతుండగా, ఒక్క రామసముద్రం మండలంలో రెండు వేల ఎకరాల్లో టమాటో పంటలు సాగవుతుంది.
నష్టం మిగ్చిలిన టమోటా
ఈ ఏడాది టమోటాను సాగు చేసిన రైతులకు ధర తగ్గడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. పంటను మార్కెట్‌కు తరలిస్తే ఆటో ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగకు ముందు మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.7లు పలికింది. అయితే మదనపల్లి మార్కెట్ యార్డ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒకేసారి మార్కెట్లకు టమోటా రావడంతో వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
మార్కెట్ వర్గాలు మాత్రం 15 రోజుల్లో ఢిల్లీ నుంచి వ్యాపారులు వస్తారని రైతుకు కొంత ఊరట లభిస్తుందని తెలుపుతున్నారు. గత ఏడాది రైతు ఉత్పత్తి దారుల సంఘం తరపున రైతు పొలంలోనే ట్రే టమోటా రూ.100 కు విక్రయాలు జరిపి కర్నాటకలోని శ్రీనివాసపురం ప్రాంతంలోని గుజ్జు తీసే ఫ్యాక్టరీకి తరలించామని అన్నారు. ఈ ఏటా మామిడి సీజన్ ప్రారంభం కావడంతో గుజ్జు తీసే ప్యాక్టరీలు కూడా టమోటా తీసు కోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, జిల్లా అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి టమాటా రైతులను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
మచ్చ పేరుతో ధర తగ్గిస్తున్నారు
ఎకరం పొలంలో టమాటా సాగు చేశాను. రూ.1.15 లక్షల వరకు పెట్టుబడి వచ్చింది. 40పెట్టెలు మార్కెట్‌కు తీసుకెళ్లాను. నాణ్యమైన సాహో రకం 30 కిలోలపెట్టె రూ.150 ప్రకారం 20 పెట్టెలు కొన్నారు. మరో 20 పెట్టెలు వర్షానికి మచ్చలు వచ్చాయని పెట్టే 70 లకు తీసుకున్నారు. అవి కూడా బాగానే ఉన్నా.. మచ్చల పేరుతో ధరలను తగ్గించి దగా చేస్తున్నారు. వినియోగదారులకు మార్కెట్లో కిలో రూ.24-35ల వరకు విక్రయిస్తున్నారు. రేయింబవుళ్లు కష్టపడితే పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. - రమేష్ , రైతు, ఆర్.నడింపల్లి
ఉత్పత్తి పెరగడమే కారణం
మండలంలో గత ఏడాదికి మించి ప్రస్తుత సీజన్‌లో టమాటా సాగు విస్తీర్ణం పెరిగింది. టమాటా ఉత్పతి పెరగడంతో ధర తగ్గింది.
- ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి ఉద్యనవనశాఖ అధికారి










