- కంపెనీల కుమ్మక్కు
- సుబాబుల్, జామాయిల్‌ను తక్కువ ధరకు సేకరణ
- నష్టపోతున్న రైతులు శ్రీ చోద్యం చూస్తోన్న ప్రభుత్వం
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : మంచాలు... కుర్చీలు... బల్లలు... అలంకరణ సామగ్రి... ఇళ్లలో వాడే ఫర్నిచర్, బెడ్‌రూముల్లో కప్‌బోర్డులు మొదలు అన్ని రకాల వస్తువులూ ఇప్పుడు ఫ్యాక్టరీల్లో తయారయ్యే న్యూవుడ్‌తోనే రూపుదిద్దుకుంటున్నాయి. న్యూవుడ్ తయారీకి సుబాబుల్, జామాయిల్ కర్రే ప్రధాన ముడిసరుకు. దీంతో, న్యూవుడ్ కంపెనీలకు సుబాబుల్, జామాయిల్ కర్ర అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఈ కర్ర లేకుంటే పరిశ్రమలు మూతే. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలు ఇటీవల సమావేశమై న్యూవుడ్ ధరలను 40 శాతం పెంచాయి. గతంలో టన్ను న్యూవుడ్ ధర రూ.25 వేలు ఉండగా ఇప్పుడు రూ.37,500కు పెంచారని స్థానిక డీలర్లు చెబుతున్నారు. న్యూవుడ్‌గా మారడానికి అయ్యే ఖర్చు భారీగా ఉండదని అంటున్నారు. న్యూవుడ్, ఫ్లైవుడ్ తయారీకి ఉపయోగపడే సుబాబుల్, జామాయిల్ రైతులు మాత్రం గిట్టుబాటు ధరల్లేక ఐదేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
ఐదేళ్లుగా అమలు కాని ఒప్పందం
మార్కెట్ కమిటీల ద్వారా సుబాబుల్, జామాయిల్ కర్రను అమ్ముకునే ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం-మిల్లర్ల మధ్య 1999లో జరిగింది. ఇదీ రైతు సంఘం పోరాటం ఫలితంగానే వచ్చింది. మార్కెట్ కమిటీల ద్వారా అమ్ముకుంటే కంపెనీలు సేకరించేవి. డబ్బులు కూడా బ్యాంకుల్లో వేసేవాళ్లు. ఎఎంసిల ద్వారానే రైతులకు చెల్లింపులు జరిగేవి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలయ్యేవి. ఈ ఒప్పందానికి మిల్లర్లు తూట్లు పొడిచారు. ఐటిసిలాంటి పెద్దపెద్ద కంపెనీల దెబ్బకు ప్రభుత్వం కూడా వదిలేసింది. దీంతో, రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో సుబాబుల్ సాగులో ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఇక్కడే సాగవుతోంది. ఏటా పది లక్షల టన్నుల కర్ర వస్తుంది. ఒప్పందం ప్రకారం సుబాబుల్ టన్ను రూ.4,200కు, జామాయిల్ రూ.4,400కు కొనాలి. ప్రస్తుతం రూ.1500 మాత్రమే కొంటున్నారు. అంటే టన్నుకు రూ.3 వేల వరకూ నష్టం రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుబాబుల్ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. దీంతో, దళారులు, మిల్లర్లు, న్యూవుడ్ ఫ్యాక్టరీల యజమానులకు మేలు జరుగుతోంది. న్యూవుడ్ ధరలను భారీగా పెంచడం వల్ల వీటితో తయారు చేసే అన్ని రకాల వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి.
కంపెనీలకు భారీగా అవసరాలు
దేశంలో న్యూవుడ్ తయారీ కంపెనీలు ప్రధానంగా నాలుగు ఉన్నాయి. అవి గ్రీన్‌ప్లే, గ్రీన్‌ప్యానల్, సెంటరీ, వీర్ కంపెనీలు. వీటికి మన రాష్ట్రంతోపాటు ఉత్తరాంచల్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తి, విశాఖపట్నంలో ఫ్యాక్టరీలు ఉండగా, బద్వేలులో తాజాగా ఓ కంపెనీ ఫ్యాక్టరీని పెడుతోంది. ఈ కంపెనీలకు రోజుకు 200కుపైగా లారీల కర్ర అవసరం ఉంది. గతంలో మనకు గుజ్జు విదేశాల నుంచి వచ్చేది. ఇప్పుడు ఆగిపోయింది. ఆయా దేశాలలో అవసరాలు, దిగుమతి సుంకాలు పెరగడంతో గుజ్జు దిగుమతి తగ్గించారు. ఇక్కడే కర్ర దొరుకుతున్నందున ఫ్యాక్టరీలను కూడా కడుతున్నారు. ఈ నేపథ్యంలో సుబాబుల్, జామాయిల్‌కు డిమాండ్ కూడా ఉంది. అయితే, కంపెనీలు పొగాకు వేలంలో మాదిరిగానే ఇక్కడ సిండికేట్ అయ్యాయి. కర్ర ధరలను పెంచకుండా న్యూవుడ్ ధరలను 40 శాతం పెంచారు. గతంలో న్యూవుడ్ షీటు రూ.1300 నుంచి రూ.1500 ఉండేది. దాన్ని ఇప్పుడు రూ.2 వేలకు పెంచారు. ఈ ధరలో కూడా కంపెనీలను బట్టి పెరుగుదల ఉంది.
రామాయపట్నం వద్ద పేపరు పరిశ్రమ ప్రశ్నార్థకం
జిల్లాలోని సుబాబుల్, జామాయిల్ కర్ర రైతులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం రామాయపట్నం వద్ద ఏషియన్ కంపెనీతో పేపరు పరిశ్రమ పెట్టించేందుకు ఒప్పందం చేసుకుంది. శంకుస్థాపన కూడా చేశారు. అయితే, ప్రభుత్వం మారాక దీని నిర్మాణం ప్రశ్నార్థకమైంది. ఇక్కడ పరిశ్రమలను పెడుతుందో, లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీంతో, సుబాబుల్ రైతుల్లో నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం సుబాబుల్ కర్ర ప్రాధాన్యతను గుర్తించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాల్సి ఉంది.










