Oct 18,2022 23:13

  • తటాకాలుగా మారిన వీధులు

ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అజిత్‌సింగ్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, పాయకాపురం తదితర ప్రాంతాలు నీట మునిగాయి. సాయంత్రం 6.10 గంటలకు చిన్నగా ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా భారీ వర్షంగా మారి 10.30 గంటల వరకూ కురుస్తూనే ఉంది. గంటల తరబడి కురిసిన భారీ వర్షానికి నగరంలో అసలే అధ్వానంగా తయారైన డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. కృష్ణలంక, రాణిగారితోట, పటమట రైతు బజార్‌, పిబి సిద్ధార్ధకళాశాల, పాలీక్లీనిక్‌ రోడ్డు, మొగల్రాజపురం, మ్యూజియం రోడ్డు, కోర్టు ఏరియా, కాంగ్రెస్‌ కార్యాలయం ఏరియా వీధులు, మ్యాంగో మార్కెట్‌ ఏరియా, పూర్ణానందంపేట, రైల్వే స్టేషన్‌ ఏరియా, చిట్టినగర్‌, విజయా డైరీ ఏరియా, కబేళా, హౌసింగ్‌బోర్డు కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. ప్రజల రాకపోకలకు, జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. బీసెంట్‌ రోడ్డు, రైతు బజార్లు, రైల్వేస్టేషన్‌, పిఎన్‌ బస్‌స్టాండ్‌, ఏలూరు రోడ్డు, బందర్‌ రోడ్డు, వన్‌టౌన్‌, ఆటోనగర్‌ తదితర ప్రాంతాల్లో వీధి, చిరు వ్యాపారాలకు అంతరాయం ఏర్పడింది. వీధులన్నీ జలమయం అయ్యాయి. పలు కాలనీలు, ప్రాంతాల్లో తటాకాల్లా దర్శనమిచ్చాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని బయటకు పంపే మార్గంలేక ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది.