ప్రజాశక్తి -కందుకూరు :రామాయపట్నం పోర్టు పనుల కోసం గ్రానైట్ ముడిరాళ్లను తరలిస్తున్న భారీ టిప్పర్ల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉందని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు దివి శివరాంతో కలిసి, సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శోభికకు ఫిర్యాదు చేశారు. చీమకుర్తి నుంచి గ్రానైట్ ముడి రాళ్లను ప్రతిరోజు వందకి పైగా భారీ టిప్పర్లలో తీసుకెళ్తున్నారని తెలిపారు. టిప్పర్లలో పరిమితికి మించి రాళ్ళను తరలిస్తున్నారని, అధిక స్పీడ్‌తో వెళ్తుండటం వల్ల ముడిరాళ్లు రోడ్లపై జారీ పడుతున్నాయని సబ్ కలెక్టర్ దష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. అనంతరం డిఎస్‌పి కండే శ్రీనివాసరావు, ఎంవిఐ మహ్మద్ రఫీను కలిసి నేతలు వినతి పత్రం అందజేశారు.










