Feb 08,2023 22:32

స్వాధీనం చేసుకున్న గంజాయిని చూపుతున్న పోలీసులు

పుట్టపర్తి రూరల్‌: శ్రీ సత్య సాయి జిల్లా సేబ్‌ అధికారులు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకుని పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి స్వాధీనం కేసు వివరాలను వెల్లడించారు. పోలీసులకు అందించిన పక్కా సమాచారం మేరకు ముదిగుబ్బ రైల్వే స్టేషన్లో రైలు దిగుతున్న పదిమందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుండి ఒక్కొక్కటి రెండు కేజీలు ఉన్న 18 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పదిమందిలో రెండు గ్రూపులు ఉండగా ఒకదానికి సాకే గణేష్‌, మరొక దానికి వనం నగేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు వీరభద్రయ్య, సరోజ, ఆవుల రమణమ్మ, సీన, ఆంజనేయులు, మిథున్‌ అనే వ్యక్తులు తుని వద్ద గంజాయిని ఒక్కొక్క కేజీ 3వేల రూపాయలతో కొనుగోలు చేసి మరొక బృందానికి 6వేల రూపాయలకు అమ్ముతున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన పదిమంది ముఠా సభ్యులను వద్దనుండి 36 కేజీల గంజాయిని, 36వేల రూపాయల నగదు సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.