రోడ్లపై, చెత్త వాహనాల్లో వేస్తున్న వైనం
ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నా చర్యలు శూన్యం
చోద్యం చూస్తున్న మున్సిపల్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మనం ఏదైనా ఆసుపత్రికి వెళితే వైద్యులు వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేయించుకుని రమ్మంటారు.. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు అవసరాన్ని బట్టి ఇంజక్షన్ వేస్తారు.. వీటి కోసం వినియోగించిన సిరంజిలను ఎక్కడ పడితే అక్కడ వేయడం ప్రాణాంతకం. వాటిని తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన బయోమెడికల్ వ్యర్థ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ఇవ్వాలి. కొందరు వైద్యులు కక్కుర్తి పడి ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్వాహకులకు వ్యర్థాలు ఇవ్వడం లేదు. రోడ్లపై, చెత్త కుండీల్లో పడేస్తున్నారు. వందల సంఖ్యలో చిన్న, పెద్ద ఆసుపత్రులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ఆసుపత్రులు, ల్యాబ్‌లు వ్యర్థాలను వీరికి ఇవ్వకుండా రోడ్లపై, చెత్త కుండీల్లో, మున్సిపల్ చెత్త వాహనాల్లో వేస్తున్నారు.
రాజంపేట పట్టణంలోని ప్రయివేట్ ఆసుపత్రులు, వాటికి అనుసంధానమైన ల్యాబరేటరీలు, మెడికల్ షాపుల నుండి రోజుకు కొన్ని వేలల్లో బయోవ్యర్థాలు పోగవుతూ ఉంటాయి. అలా పోగైన బయోవ్యర్థాలను సాధారణ వ్యర్థాలను తొలగించే పురపాలక వాహనాలలో కాకుండా ఒక ప్రత్యేక వాహనం ద్వారా జనావాసాలు లేని ఒక సురక్షితమైన ప్రాంతానికి తరలించి అక్కడ కాల్చివేయాల్సి ఉంది. పట్టణంలో అలాంటి పరిస్థితులు కనబడటం లేదు. ఆసుపత్రులు నుంచి విడుదలయ్యే సూదులు, సిరంజిలు, గాయాలకు కట్లు కట్టిన దూది, కట్టు గుడ్డ, బ్యాండేజ్ క్లాత్స్, బ్లడ్ బాగ్స్, సెలైన్ బాటిళ్లు, ఐవి సెట్లు, గ్లౌజులు, లాబరేటరీలు నుంచి విడుదలయ్యే రక్తం తీయుటకు వినియోగించిన సూదులు, దూది, డిస్పోజల్ టెస్ట్ ట్యూబ్‌లు, మెడికల్ షాపుల నుంచి విడుదలయ్యే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు మొదలైన వాటిని ఎక్కడబడితే అక్కడ రోడ్లమీద, మురుగు కాలువలు, చెత్త డబ్బాలలోను విచ్చలవిడిగా పడవేస్తున్నారు. ఇలా పడవేయడం వలన చెత్త ఎత్తే సమయంలో వాటి బారిన పడి మున్సిపల్ కార్మికులు అనారోగ్యాల పాలయ్యే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. హెచ్‌ఐవి రోగులకు వినియోగించే సూదులు, బయోవ్యర్థాలు సైతం అందులో ఉండడం వలన పొరపాటున కార్మికులకు ఆ సూదులు గుచ్చుకుంటే వారి జీవితాలు తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు. చెత్తకుప్పల దగ్గర వాటిని పడవేయడం వలన ఆవులు, కుక్కలు, ఇతర జంతువులు వాటిని తిని గాయాలపాలై రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. బయోవ్యర్థాల మేనేజ్మెంట్ చట్టం 1996 యాక్ట్ ప్రకారం ఈ వ్యర్ధాలు ఇతర సాధారణ వ్యర్ధాలతో కలవకూడదు. ప్రత్యేకమైన జాగ్రత్తలతో తరలించి వాటిని కాల్చివేయాలని చట్టం చెబుతోంది. కడప, తిరుపతి వంటి నగరాలలో బయోవ్యర్థాలను తరలించడానికి ప్రత్యేకమైన కంటైనర్లను వినియోగిస్తున్నారు. పట్టణంలో అలాంటి ప్రత్యేకమైన చర్యలు చేపట్టకపోతే ప్రజలు, పశువులతో పాటు పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా బయో మెడికల్ వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యేకమైన కంటైనర్లు, వాహనాలను వినియోగించాలని, ఈ వ్యర్థాలను ఆసుపత్రులు, మెడికల్ షాపులు, లేబరేటరీల వారు ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా చెత్తకుప్పల లోను, డ్రైనేజీ కాలువలలోను పడవేయకుండా మునిసిపల్ మరియు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
ప్రయివేటు ఆసుపత్రులు బయోవ్యర్థాలను తరలించడానికి రుసుము చెల్లించి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ వారు అలా చేయడం లేదు. ఇదే సమస్యపై గతంలో ఆసుపత్రుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ ప్రైవేటు ఆసుపత్రుల వారు షరా మామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరలా ఈ సమస్య పట్ల ప్రైవేటు ఆసుపత్రులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసి అదుపు చేయడానికి ప్రయత్నిస్తాను.
- శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, రాజంపేట.










