May 06,2022 08:28
  • విచారణ ప్రారంభించిన ఆర్ధికశాఖ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకుల్లో చేసిన ప్రభుత్వ డిపాజిట్లు మాయమవుతున్నాయి. కార్పొరేషన్లకు చెందిన అధికారుల ప్రమేయం లేకుండా డిపాజిట్లు ఖాళీ అవుతుండటం కలకలం రేపుతోంది. దీంతో ఆర్థిక శాఖ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో రెండు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆర్థికశాఖ అప్రమత్తమై అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసింది. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించి 9.60 కోట్ల రూపాయలను ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. దాదాపుగా ఈ మొత్తం నిధులు బ్యాంకు నుండి విత్‌డ్రా అయ్యాయి. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పేరుతోనే కరెంటు ఖాతా ఏర్పాటు చేసి, దాని ద్వారా నిధులు తరలించారు. అయితే, కరెంటు ఖాతాకు సంబంధించి తాము ఎటువంటి ప్రతిపాదన చేయలేదని, అసలు ఆ వ్యవహారం తమ దృష్టిలోనే లేదని వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు అంటున్నారు. .ఈ ఖాతాను ఎవరు తెరిచారు, అందులో బ్యాంకులు, సంస్థ ఉద్యోగుల పాత్ర ఉందా అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ సంస్థలో కూడా ఇటువంటి ఘటనే వెలుగుచూసినట్లు ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థ ఐదు కోట్ల రూపాయలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా బ్యారకులో వేసింది. అయితే సంస్థకు తెలియకుండానే ఈ నిధులు ఉపసంహరణ జరిగినట్లు గుర్తిరచారు. ఈ డిపాజిట్‌కు సంబంధిరచిన నకిలీ రసీదులు సంస్థకు చేరుకోగా, ఒరిజినల్‌ డిపాజిట్‌ ఖాతాకు సంబంధించిన నిధులు ఉపసంహరణ జరిగి వేరే ఖాతాలకు మళ్లినట్లు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లోనూ సంబంధిత కార్పొరేషన్‌ ఉద్యోగులతో పాటు, బ్యాంకు సిబ్బందిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.