Apr 01,2023 21:51

పాచిపట్టిన రోడ్డుపైనే కొనుగోలు చేస్తున్న వినియోగదారులు

          ప్రజాశక్తి-రొద్దం  మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన వారపు సంత బురదలో సాగింది. మండల కేంద్రంలో ప్రతి శనివారం వారపు సంత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం పెనుగొండ ప్రధాన రహదారిలోని చావిడి వద్ద పైప్‌లైన్‌ లీకేజీ అవుతోంది. దీంతో మోటార్‌ ఆన్‌ చేసినప్పుడల్లా నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఆ నీరంతా రోడ్డుపై వెళ్లకుండా దుకాణాల వైపు కాలువ ఏర్పాటు చేసి ఒకవైపు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. ఆ కాలువ కొద్దికొద్దిగా తెగిపోవడంతో నీరు పారి రోడ్డుపై పాచిపట్టి ప్రమాదకరంగా మారింది. దీంతో సంతకు వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది భయపడతూ సంత చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టి వారపు సంతను శుభ్రం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.