ప్రజాశక్తి-విజయవాడఅర్బన్
చిన్నపిల్లల్లో బుద్ధి మాంద్యంగా పిలువబడే సెరిబ్రల్ పాల్సీ సమస్యకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గా నాగరాజు తెలిపారు. ఈ నెల ఆరో తేదీన వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే పురస్కరించుకుని అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్యారావుపేటలోని ఆసుపత్రిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డల్లోనూ, పుట్టిన వెంటనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందకపోవడం, మూర్చరోగం వల్ల, తలకు దెబ్బతగలడం వంటి కారణాలతో సెరిబ్రల్ పాల్సీ సమస్య ఏర్పడవచ్చన్నారు. మెదడులోని కణజాలం దెబ్బతినడం వల్ల కండరాలు బిగుతుగానూ, వదులుగానూ మారిపోవడం వల్ల సంబంధిత శరీర భాగాలు సక్రమంగా పనిచేయవని తెలిపారు. రెండేళ్ల వయసు దాటినా పిల్లలు నడవలేకపోతే సెరిబ్రల్ పాల్సీ కారణం కావచ్చన్నారు. లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స ఆరంభిస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. ఫిజియోథెరపీ, బొటాక్స్ ఇంజెక్షన్లు, ఆపరేషన్ల ద్వారా సెరిబ్రల్ పాల్సీ సమస్యకు చికిత్స అందించవచ్చన్నారు. గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆసుపత్రిలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైద్యులు విశ్వేశ్వరరావు, కవిత తదితరులు పాల్గొన్నారు.










