Dec 26,2021 08:17
  • జనవరి నుంచి 12 శాతం విధింపు
  • వినియోగదారులపై మోయలేని భారం
  • అమ్మకాలు తగ్గిపోతాయంటూ వస్త్రవ్యాపారుల ఆందోళన

ప్రజాశక్తి- యంత్రాంగం : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై గోరుచుట్టుపై రోకలి పోటులా కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై జిఎస్‌టిని భారీగా పెంచింది. వస్త్రాలపై ప్రస్తుతం జిఎస్‌టి ఐదు శాతం ఉంది. వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి 12 శాతం వసూలు చేయనుంది. దీంతో, వస్త్రాల ధరలు పెరిగి వినియోగదారులపై ఆ మేరకు భారం పడనుంది. కొనుగోళ్లు తగ్గిపోయి తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావం వల్ల వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్నాయని, జిఎస్‌టి పెంపుతో వ్యాపారం మరింత తగ్గిపోయి కుదేలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో వస్త్ర వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది.
     -తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, ద్వారపూడి అతి పెద్ద హోల్‌సేల్‌ వస్త్ర వ్యాపార దుకాణాలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతాల్లో హోల్‌సేల్‌, రిటైల్‌ షాపులు 1,500పైగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా మొదలుకుని విజయనగరం వరకు లక్షలాది మంది చిన్న వ్యాపారులు ఇక్కడి నుంచే వస్త్రాలను హోల్‌సేల్‌ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఒడిశా, కోల్‌కత్తా ప్రాంతాలకు ఇక్కడి నుంచే దుస్తుల ఎగుమతులు జరుగుతుంటాయి. రోజుకు రూ.30 కోట్లు నుంచి రూ.45 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుంది. జిఎస్‌టి పెంపుతో ఏడాదికి సుమారు రూ.1,152 కోట్ల వరకూ భారం పడనుంది. ఈ భారమంతా అంతిమంగా వినియోగదారులే భరించాల్సి వస్తుంది.
    -జిల్లా కేంద్రమైన విజయనగరంలోని బాలాజీ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో సుమారు 300 వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఇవి కాకుండా మెయిన్‌ రోడ్డు, ఉల్లివీధి తదితర ప్రాంతాల్లో చిన్నపెద్ద కలుపుకుని మరో 400 దుకాణాలు ఉంటాయి. సూరత్‌, కోల్‌కత్తా, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడి వ్యాపారులు వస్త్రాలను రప్పిస్తుంటారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒడిశాలోని రాయగడ, పర్లాకిమిడి, బరంపురం, సుంకి, సునాబెడా, జైపూర్‌ వరకు ఉన్న చిన్న వ్యాపారులు ఇక్కడ వీటిని కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, దీపావళి, క్రిస్మస్‌ తదితర పండగలకు నెల రోజుల ముందు నుంచే వినియోగదారులతో మార్కెట్‌ రద్దీగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల సమయంలో మరింత కళకళలాడుతుంది. జిల్లాలో ప్రతి నెల వస్త్ర వ్యాపారం రూ.కోట్లలోనే ఉంటుంది.
     -ప్రకాశం జిల్లాలో చీరాల వస్త్ర వ్యాపార కేంద్రంగా ఉంది. ఆ తర్వాత ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీమకుర్తిలో ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. జిల్లాలో మూడు వేలకుపైగా వస్త్ర దుకాణాలు ఉండగా, వాటిలో సగం చీరాలలోనే ఉన్నాయి. జిల్లాలో ఏటా రూ.మూడు వేల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని పెంపుతో జిల్లాపై ఏటా సుమారు రూ.210 కోట్ల భారం పడనుంది.
 

                                                    వస్త్ర వ్యాపారుల ఉద్యమ బాట

టైక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా దేశ వ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా ఉద్యమం చేపట్టాలని ఈ నెల ఐదున విజయవాడలో జరిగిన సమావేశంలో వస్త్ర వ్యాపారుల సంఘం నిర్ణయించింది. భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించు కుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వస్త్ర వ్యాపారులు ఇప్పటికే పలురూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. జిఎస్‌టి పెంపునకు వ్యతిరేకంగా షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

                                           ధరలు పెరుగుతాయని ముందే వచ్చాను

మాది తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట. ఏటా జనవరిలో బట్టలు కొనేవాడిని. జనవరి నుంచి బట్టలపై జిఎస్‌టి పెరుగుతుందని పిల్లలు చెప్పారు. బట్టల ధరలు పెరిగిపోతాయన్నారు. దీంతో, ముందుగానే బట్టలు కొనడానికి రాజమండ్రి వచ్చాను. ఏటా ఇక్కడే బట్టలు కొంటాను. ఇప్పటికే బట్టల ఖరీదు ఎక్కువగానే ఉంది. ఇంకా పెరిగిపోతే కొనడం కష్టమే.

బట్టలపై జిఎస్‌టి బాదుడు


                                                     - సిహెచ్‌.సత్యనారాయణ, వినియోగ దారుడు

                                                         ఉపసంహరించుకోవాలి

జిఎస్‌టి పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ముడిసరుకు నుంచి విక్రయం వరకు వివిధ దశల్లో చెల్లించే పన్నులు భారీగా ఉన్నాయి. కోవిడ్‌, పెద్ద నోట్ల రద్దు, ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఫలితంగా ఐదేళ్లుగా వ్యాపారాలు లేవు. షాపుల అద్దె కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. ఊరట కల్పించాల్సిన ప్రభుత్వాలు భారాలు వేయడం తగదు.

బట్టలపై జిఎస్‌టి బాదుడు


                                                             - కాలెపు వెంకట వీరభద్రరావు,
                                          ది రాజమండ్రి హోల్‌సేల్‌ క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు



                                             జిఎస్‌టి పెంపు బడా వ్యాపారుల కోసమే
వస్త్ర వ్యాపారంపై జిఎస్‌టి పెంపు బడా కార్పొరేట్‌ షాపింగ్‌ మాల్స్‌ ప్రయోజనం కోసమే. పెరిగిన జిఎస్‌టి భారంతో మాలాంటి మధ్య తరగతి, మాపై ఆధారపడిన చిన్న వ్యాపారుల లావాదేవీలు తగ్గిపోతాయి. ఆ మేరకు బిజినెస్‌ను బడా వస్త్ర వ్యాపారులు ఆక్రమిస్తారు. క్రమంగా చిన్న, మధ్య తరగతి వ్యాపారులు పూర్తిగా కుదేలవుతారు. ఆ తరువాత వస్త్ర వ్యాపారమంతా కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిఎస్‌టి పెంచుతోంది.

                                                                         -నిర్మల్‌కుమార్‌
                                       పొకర్న, బాలాజీ టెక్స్‌టైల్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, విజయనగరం