హిందూపురం : ఆ ఇద్దరూ బతికే ఉన్నారు... అందులో ఒకరు మక్కాయాత్రకు వెళ్లారు.... మరొకరు బంధువులు అనారోగ్యంగా ఉన్నారని తెలిసి పరామర్శించడానికి వేరే ఊరు వెళ్లారు. అలా వెళ్లే సమయంలో ఈ ఇద్దరూ వారి పరిధిలో ఉన్న వార్డు వాలంటీర్ సహకారంతో సచివాలయ ఉద్యోగికి తాము ఈనెల పింఛను తీసుకునే సమయంలో అందుబాటులో ఉండమని లిఖిత పూర్వకంగా అర్జీ రాసి ఇచ్చి వెళ్లారు. అయినా సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యానికి ఆ ఇద్దరూ బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు అయ్యింది. హిందూపురం పురపాలక సంఘంలోని 16వ వార్డు రహమత్ పురంలో చోటుచేసుకున్న ఈ ఘటన సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. అభివద్ధి నుంచి సంక్షేమం వరకు అన్ని శాఖలకు సంబంధించి సెక్రటరీలను నియమించింది. వీరితో పాటు 50 గహాలకు ఒక వార్డు వాలంటీర్‌ను నియమించి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే క్షేత్ర స్థాయిలో కొందరు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. హిందూపురం పురపాలక సంఘంలోని రహమత్‌పురంలోని 16వ వార్డు సచివాలయ పరిధిలోని గుల్‌షిరా, అబీదాలు సామాజిక పింఛన్లు తీసుకుంటున్నారు. కాగ వీరిలో గుల్‌షీరా మక్కాకు వెళ్లింది. అబిదా ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళ్లింది. వీరిద్దరూ నవంబర్‌లో పింఛను తీసుకుని డిసెంబర్ తాము వ్యక్తిగత కారణాల వల్ల తాము అందుబాటులో ఉండడం లేదని వాలంటర్ ద్వారా సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీకి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. డిసెంబర్ 1వ తేదీ పింఛన్ వచ్చింది. లబ్ధిదారులు ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో దీనిపై ఏ మాత్రం విచారణ చేయకుండా, కనీసం వాలంటీర్‌ను కూడా సంప్రదించకుండా మరణించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో జనవరి నెల పింఛను రాలేదు. జనవరి నెలలో ఇంటి వద్ద ఉన్న ఇద్దరూ 1వ తేదీన పింఛన్ కోసం వాలంటీర్‌ను సంప్రదించారు. సచివాలయంకు పింఛన్ ఐడిను చూడగా ఇద్దరూ మృతి చెందినట్లు ఆన్‌లైన్‌లో ఉంది. దీంతో ఇద్దరు లబ్ధిదారులు ఖంగుతున్నారు. వీరికి జరిగిన అన్యాయంపై పలుమార్లు సచివాలయ వెల్ఫేర్‌ను సంప్రదిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దాదాపు రెండు నెలలుగా వీరు పింఛన్ పునరుద్ధరణ కోసం సచివాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో చేసేది లేక ఇద్దరు మహిళలు నాలుగు రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావును కలిసి వారి సమస్యను విన్నవించారు. బతికుండగానే రికార్డుల్లో తమను చంపేశారని, పరిశీలించి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి పింఛను పునరుద్ధరణ అయ్యేలా చూస్తామంటూ కమిషనర్ వారికి హామీ ఇచ్చారు.
ఇబ్బంది పడుతున్నా : గుల్‌షిరా
బతికున్న తనను రికార్డుల్లో మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో పింఛన్ ఆగిపోయింది. రెండు నెలలుగా పింఛను సొమ్ము అందక ఇబ్బంది పడుతున్నాను. దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడుతున్న తాను పింఛను డబ్బుతో మందులు కొనుగోలు చేసుకుని ఒకరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాను. సచివాలయ ఉద్యోగులు చేసిన తప్పునకు నేను ఇబ్బందులు పడుతున్నాను.
సచివాలయం చుట్టూ తిరుగుతున్నా : అబీదా
అకారణంగా పింఛన్‌ను తొలగించారు. దీనిని పునరుద్ధరించాలని రెండు నెలల నుంచి సచివాలయం చుట్టూ తిరిగితున్నాను. అయినా ఎవరూ పట్టించుకోడం లేదు. ఈ నెల, మళ్లీ నెల అంటూ సాకులు చెబుతున్నారు. పింఛను డబ్బుతోనే నేను జీవనం సాగిస్తున్నాను. అధికారులు స్పందించి తన పింఛన్‌ను పునరుద్ధరించాలి.










